
Lakhimpur Kheri: లఖింపుర్ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ
లఖ్‌నవూ: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం పోలీసుల రిమాండులో ఉన్న ఆయన్ని చికిత్స నిమిత్తం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు మధుమేహ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. క్రైం బ్రాంచ్ పోలీసు సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం గత శనివారం ఆయన్ని అరెస్ట్ చేశారు. విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. దీంతో తొలుత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఆ తర్వాత పోలీసులు రిమాండ్‌కు తీసుకున్నారు.