Lakhimpur violence: లఖింపుర్‌ ఖేరీ కేసు.. కోర్టులో ఆశిష్‌మిశ్ర సరెండర్‌

యూపీలోని లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర లఖింపుర్‌ ఖేరీ జిల్లా కోర్టులో సరెండర్‌ అయ్యాడు.

Updated : 24 Apr 2022 17:49 IST

లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటన కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర సరెండర్‌ అయ్యాడు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లొంగిపోయాడు. అనంతరం అధికారులు ఆశిష్‌ను లఖింపుర్‌ ఖేరీ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈనెల 18న పరిశీలించిన సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తుది గడువుకు ఒకరోజు ముందుగానే ఆశిష్‌ సరెండర్‌ అయ్యాడు.

లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రకు అలహాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కేసు విచారణ ప్రారంభం కాకముందే.. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై గతంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఆశిష్‌కు బెయిల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అనేక పరిణామాల అనంతరం ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని