Published : 27 May 2022 16:27 IST

Ashok Gehlot: మా మంత్రి పనితీరు భేష్.. ఒత్తిడితో అలా మాట్లాడుంటారు..!

మంత్రి ట్వీట్‌పై స్పందించిన అశోక్‌ గెహ్లోత్‌

జైపూర్‌: ఈ క్రూరమైన పదవి నుంచి నాకు విముక్తి కల్పించండంటూ రాజస్థాన్‌ మంత్రి అశోక్‌ చాంద్నా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ స్పందించారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమేం కాదంటూ మంత్రి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్నారు. ‘మంత్రిగా అశోక్ చాంద్నా మెరుగ్గా పనిచేస్తారు. ఇటీవల తగిన ప్రణాళికతో క్రీడా పోటీలను నిర్వహించారు. ఆయన మీద చాలా బాధ్యతలున్నాయి. ఆ ఒత్తిడితోనే ఏదో మాట్లాడుంటారు. వాటిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆయనతో మాట్లాడతాను’ అని గెహ్లోత్ అన్నారు.  

గెహ్లోత్‌ ప్రధాన కార్యదర్శి తీరుతో అసంతృప్తికి గురైన అశోక్‌ చాంద్నా ట్విటర్‌ వేదికగా దాన్ని బయటపెట్టారు. ప్రధాన కార్యదర్శే అన్ని శాఖలకు మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటప్పుడు ఈ మంత్రి పదవి తనకు వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రూరమైన మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించి.. బాధ్యతలన్నీ ఆ కార్యదర్శికే అప్పగించాలని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి స్పందించారు. ఇంతకు ముందు ఎమ్మెల్యే గణేశ్‌ ఘోగ్రా ఇదే తరహాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇప్పటికే గెహ్లోత్, మరో సీనియర్‌ నేత సచిన్ పైలట్ వర్గాల మధ్య పలుమార్లు విభేదాలు పొడచూపాయి. అధిష్ఠానం వారిని బుజ్జగిస్తూ.. వాటిని తాత్కాలికంగా పరిష్కరిస్తోంది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ఈ తరహా వ్యాఖ్యలను భాజపా అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. దాంతో ఈ ఘటననలు రాజస్థాన్‌లో హస్తం పార్టీకి తలనొప్పిగా మారాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని