Ashok Khemka: రోజుకు 8 నిమిషాల పనికి.. ఏడాదికి రూ.40 లక్షలు తీసుకుంటున్నా..!

అవినీతిని పారదోలేందుకు తనకు విజిలెన్స్ విభాగం బాధ్యతలు అప్పగించాలని ఐఏఎస్‌ అధికారి అశోక్ ఖేమ్కా(Ashok Khemka) కోరారు. ఈ మేరకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Published : 25 Jan 2023 16:33 IST

చండీగఢ్‌: రోజులో ఎనిమిది నిమిషాలుండే పనికోసం తనకు ఏడాదికి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారని అని ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా(Ashok Khemka) అన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు తనకు స్టేట్ విజిలెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ మేరకు తాజాగా ఆయన హరియాణా(Haryana) ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఎక్కువ సార్లు బదిలీయైన ఐఏఎస్‌ అధికారిగా అశోక్‌ ఖేమ్కా వార్తల్లో నిలుస్తుంటారు. హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ఆర్కైవ్స్‌ శాఖకు బదిలీ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కాకు ఇది 56వ బదిలీ. దీనిపై ఆయన 23వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. 

‘నన్ను జనవరి 9న ఆర్కైవ్స్‌ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్‌ రూ.4 కోట్లు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆ మొత్తం 0.0025 శాతానికి కంటే తక్కువే. అదనపు ప్రధాన కార్యదర్శిగా నాకు సంవత్సరానికి అందుతున్న జీతం రూ.40 లక్షలు. అంటే ఆర్కైవ్స్‌ విభాగం బడ్జెట్‌లో అది 10 శాతం. ఇక్కడ ఒక వారంలో గంటకు మించి పనిలేదు. మరోపక్క కొంతమంది అధికారులు తలకు మించిన పనితో సతమతమవుతున్నారు. ఇలా కొందరికి పనిలేకుండా, మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు. 

అవినీతిని చూసినప్పుడు.. నా మనసు ఎంతగానో తల్లడిల్లుతుంది. వ్యవస్థకు పట్టిన క్యాన్సర్‌ను వదిలించాలనే తపనతో నా కెరీర్‌ను పణంగా పెట్టాను. అవినీతిని పారదోలే విషయంలో విజిలెన్స్‌ విభాగం ముఖ్యమైనది. కెరీర్ చివరి దశలో ఉన్న నేను ఈ విభాగంలో సేవలు అందించాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే.. అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం జరుగుతుందని హమీ ఇస్తున్నాను’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. 

ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని హరియాణా నేతలు కొనియాడినప్పటికీ..  తన కెరీర్‌లో ఎక్కువ సార్లు ఖేమ్కా అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగారు. ఆర్కైవ్స్‌ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి. 2025లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని