Ashraf Ahmed: రెండు వారాల్లో నన్ను చంపేస్తారు..!: గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ సోదరుడి ఆరోపణలు

యూపీ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌(Ashraf Ahmed).. త్వరలో తనను చంపేస్తారని వ్యాఖ్యలు చేశాడు. ఓ అధికారి తనను  బెదిరించాడని చెప్పాడు. 

Published : 29 Mar 2023 11:00 IST

లఖ్‌నవూ: ‘రెండువారాల్లో నన్ను చంపేస్తారు’ అంటూ గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్(Atiq Ahmed)  సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) ఆరోపణలు చేశాడు. 2006లో ఉమేశ్‌ పాల్ కిడ్నాప్‌ కేసు (Umesh Pal Kidnap Case)లో అష్రాఫ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం బరేలీ జైల్లో ఉన్నాడు.  ఇతడికి మరో పేరు ఖలీద్‌ అజీం అని తెలుస్తోంది. 

‘రెండు వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తానని ఒక సీనియర్ అధికారి నన్ను బెదిరించాడు. నాపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవి. నాపై పెట్టిన తప్పుడు కేసులతో నేను పడుతున్న బాధను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు’ అని అష్రాఫ్ వ్యాఖ్యానించాడు. అయితే ఆ అధికారి ఎవరని ప్రశ్నించగా.. తాను పేరు చెప్పలేనన్నాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్‌లో ఆ పేరు ముఖ్యమంత్రికి చేరుతుందని వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు. 

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, రాజు పాల్‌ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. ఉమేశ్‌ పాల్ కేసు వేసిన వారిలో అష్రాఫ్(Ashraf Ahmed) కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో అతడు నిర్దోషిగా తేలాడు. అతీక్‌ అహ్మద్ (Atiq Ahmed)ను యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు (Prayagraj Court) దోషిగా తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని