రత్న భాండాగారం తెరవాలి.. పూరీ ఆలయ యంత్రాంగానికి పురావస్తు శాఖ లేఖ

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరవాలని పురావస్తు శాఖ ఆలయ యంత్రాగానికి సూచించింది.

Published : 13 Aug 2022 00:33 IST

పూరీ/గోపాల్‌పూర్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరవాలని పురావస్తు శాఖ ఆలయ యంత్రాగానికి సూచించింది. 12వ శతాబ్దం నాటి ఈ భాండాగారం లోపలి స్థితిని అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉందని అందులో పేర్కొంది. ఈ మేరకు ఆలయ పాలనాధికారితో పాటు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసింది. చాలా కాలంగా రత్న భాండాగారం తెరవనందున లోపలి పరిస్థితి ఎలా ఉందన్నది స్పష్టత లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్‌ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. అప్పట్లో కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించారు. ఈ క్రమంలో పైకప్పుల పెచ్చులు ఊడడం, గోడల్లో తేమ ఉండడం గమనించారు. ఈ క్రమంలో సమగ్ర అధ్యయనం చేపట్టిన పురావస్తు శాఖ మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉందని, కాబట్టి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని యంత్రాంగానికి రాసిన లేఖలో సూచించింది.

ఎందుకంత ప్రాధాన్యం..?

పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెక్కింపు చేపట్టాలని ఇతర సంఘాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి. పురాతన నివేదికలు ఉన్న వివరాల మేరకు ఆభరణాలన్నీ ఉన్నాయా? అన్నది స్పష్టంచేయాలని అంతా కోరుతున్నారు. ఒకసారి రహస్య మందరి తలుపులు తెరిస్తే కచ్చితంగా లెక్కింపు జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.

మరోవైపు, పురావస్తు శాఖకు రాసిన లేఖ ఇంకా తాను చూడలేదని న్యాయశాఖ మంత్రి జగన్నాథ సారక చెప్పారు. లేఖలో ఏముందో చూసుకుని తలుపులు ఎలా తెరవాలి? ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, భాండగారం తలుపులు తెరవాలంటే ఆలయ పాలకవర్గంతో పాటు న్యాయశాఖ కూడా అనుమతించాల్సి ఉంటుంది. చివరిసారిగా 1978, 1982లో ఈ భాండాగారాన్ని తెరిచారు. అప్పట్నుంచి భాండాగారం మూసివేసే ఉంది. ఈ తలుపులు తెరిచే అంశంపై అసెంబ్లీలో గతంలో చర్చ కూడా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని