Asian Games: అరుణాచల్‌ అథ్లెట్లపై ‘చైనా’ వివక్ష.. దీటుగా స్పందించిన భారత్

చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు (Asian Games) సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతుండటంపై భారత్‌ దీటుగా స్పందించింది.

Updated : 22 Sep 2023 16:13 IST

దిల్లీ: చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు (Asian Games) సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది. దీనిపై తాజాగా భారత్‌ ప్రతిస్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేందుకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు దిగిందని పేర్కొంటూ అధికారికంగా నిరసన తెలియజేసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా పర్యటన కూడా రద్దు చేసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది.

‘చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడల ప్రవేశానికి భారత్‌కు (అరుణాచల్‌ ప్రదేశ్‌) చెందిన కొందరు క్రీడాకారులకు అక్రిడిటేషన్‌ నిరాకరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భారత క్రీడాకారులపై చైనా ఈ తరహా వివక్ష చూపినట్లు తెలుస్తోంది. స్థానికత, వర్గం ఆధారంగా తమ పౌరులను భిన్నంగా చూడటాన్ని భారత్‌ గట్టిగా తిరస్కరిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో భాగమే’ అని భారత విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు.

‘భారత క్రీడాకారులపై ఇలా ఉద్దేశపూర్వకంగా, ఎంపిక పద్ధతిలో వివక్ష చూపడంపై దిల్లీతోపాటు అటు బీజింగ్‌లోనూ భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ తరహా చర్యలు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది’ అని పేర్కొంటూ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలాఉంటే, సరిహద్దుల విషయంలో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ విడుదల చేసిన మ్యాప్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమేనని ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్‌.. ఎలాంటి ఆధారాల్లేకుండా మ్యాప్‌ను రూపొందించిందని మండిపడింది. దౌత్యమార్గాల్లో గట్టి నిరసన వ్యక్తం చేసినప్పటికీ.. ఇదంతా చట్ట ప్రకారమేనంటూ చైనా తన చర్యను సమర్థించుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని