Maharashtra Crisis: ‘శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు.. వెంటనే అస్సాంను వీడండి’

శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలను వెంటనే తమ రాష్ట్రాన్ని వీడి వెళ్లాలని అస్సాం కాంగ్రెస్‌ కోరింది. ఈ మేరకు ఏక్‌నాథ్‌ శిందేకు అస్సాం కాంగ్రెస్‌ చీఫ్ భూపెన్‌ కుమార్‌ బోరా లేఖ రాశారు.

Published : 24 Jun 2022 22:03 IST

ఏక్‌నాథ్‌ శిందేకు లేఖ రాసిన అస్సాం కాంగ్రెస్‌ చీఫ్‌

గువాహటి: శివసేన (shiv sena) అధ్యక్షుడు, మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (uddhav thackeray)పై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటిలో ఉన్న రాడిసన్‌ బ్లూ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెబల్‌ ఎమ్మెల్యేలను వెంటనే రాష్ట్రాన్ని వీడి వెళ్లాలని కోరింది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ భూపెన్ కుమార్‌ బోరా రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)కు లేఖ రాశారు. వరదలతో అస్సాం అతలాకుతలం అవుతున్న వేళ శివసేన ఎమ్మెల్యేలు రాచమర్యాదలు పొందడం రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

‘‘అస్సాం ప్రజలు నైతికత, విలువలకు చాలా గౌరవం ఇస్తారు. రాష్ట్ర ప్రజలు వరదలతో సతమవుతున్న వేళ మీరు గువాహటిలో ఎమ్మెల్యేలతో బస చేయడం, దీన్ని మీడియా బాగా కవరేజీ చేయడం ఇక్కడి ప్రజలకు అంత మంచిది కాదు. ఓ వైపు రాష్ట్రంలో వరదలు ముంచెత్తి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు అతిథి మర్యాదలు ఇవ్వడం ఏమాత్రం ఆమోద్యయోగం కాదు. ఇటువంటి సమయంలో మీరిక్కడ ఉండడం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజారుస్తోంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని బోరా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల కోసం ఫైవ్‌ స్టార్‌ హోటల్లో 7 రోజులకుగాను 70 రూమ్‌లు బుక్‌ చేశారని నిన్న వార్తలు వెలువడ్డాయి. వీరికి ఆహారం, ఇతర సేవలన్నీ కలుపుకొని ఒక్క రోజుకు రూ.8 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని