Assam: జిహాదీ కార్యకలాపాలకు స్థావరంగా అస్సాం: సీఎం హిమంత

జిహాదీ కార్యకలాపాలకు అస్సాం స్థావరంగా మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన ఐదు నెలల్లోనే బంగ్లాదేశ్ కేంద్రంగా నడిచే...

Published : 05 Aug 2022 01:27 IST

గువాహటి: జిహాదీ కార్యకలాపాలకు అస్సాం స్థావరంగా మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన ఐదు నెలల్లోనే బంగ్లాదేశ్ కేంద్రంగా నడిచే ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న ఐదు ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ‘బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్‌ ఇస్లాం అనే సంస్థతో సంబంధమున్న ఆరుగురు వ్యక్తులు అస్సాంలోకి చొరబడ్డారు. యువతలో ఉగ్రవాదాన్ని ప్రరేపించేందుకు వచ్చిన ఆ వ్యక్తుల్లో ఒకరు అరెస్టయ్యారు. గతంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడో ఒకసారి వెలుగు చూస్తుండగా.. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల వ్యక్తులు ఇక్కడకు వచ్చి ప్రైవేటు మదర్సాల ద్వారా యువతను తప్పుదోవ పట్టించడం ప్రమాదకరమైన విషయం. అయితే.. పోలీసులు, భద్రతా సిబ్బంది పూర్తి నిఘాతో ఉన్నారు’ అని హిమంత వెల్లడించారు.

‘ఉగ్రవాదంతో పోలిస్తే జిహాదీ కార్యకలాపాలు అత్యంత ప్రమాదకరమైనవి. బోధనతో మొదలై.. ఆ తర్వాత మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించే దిశగా సాగుతాయి. ఆ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. ఇది చివరకు విధ్వంసాలకు దారితీస్తుంది’ అని హిమంత పేర్కొన్నారు. ‘‘అన్సరుల్ ఇస్లాం’ అల్-ఖైదాతో అనుబంధం కలిగి ఉంది. ఇటీవల హతమైన అల్ జవహరీ సైతం అస్సాంలో జిహాద్ గురించి ప్రస్తావించాడు. రాష్ట్రం వారి దృష్టిలో ఉందని ఇది రుజువు చేస్తోంది’ అని తెలిపారు. చొరబాటుదారుల్లో ఇప్పటివరకు ఒకరు మాత్రమే అరెస్టయ్యారని,  బోధన పేరిట బయటి నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైనా ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే స్థానిక పోలీసులకు తెలియజేయాలని హిమంత బిస్వశర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని