Drugs: ₹163 కోట్ల విలువైన డ్రగ్స్‌ దహనం!

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు అసోం సర్కారు నడుం బిగించింది. అందులో భాగంగా.. గడిచిన రెండు నెలల్లో పోలీసులు పట్టుకున్న సుమారు రూ.163 కోట్ల

Published : 18 Jul 2021 01:32 IST

గువాహటి: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు అసోం సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా గడిచిన రెండు నెలల్లో పోలీసులు పట్టుకున్న సుమారు రూ.163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను రెండు రోజులపాటు బహిరంగంగా దహనం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ డ్రగ్స్‌ను మంటల్లో వేసి కాల్చివేసేందుకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. దిఫు, గోలాఘాట్‌ ప్రదేశాల్లో సీఎం హిమంత బిశ్వశర్మ మాదకద్రవ్యాలకు శనివారం బహిరంగంగా నిప్పంటించారు. మిగిలిన మాదకద్రవ్యాలను నాగావ్‌, హోజాయ్‌లలో ఆదివారం దహనంచేయనున్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘పోలీసుల చొరవతో గడిచిన రెండు నెలల్లో మేం రూ.163 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం. అయితే ఇది రాష్ట్ర నార్కోటిక్స్‌ మార్కెట్లో 20-30 శాతం మాత్రమే. రాష్ట్రంలో రూ.2000-3000 కోట్ల విలువైన నార్కోటిక్స్‌ మార్కెట్‌ ఉంటుంది. పొరుగు దేశాల నుంచి భారత భూభాగంలోకి మాదక ద్రవ్యాల రవాణా మార్గంగా మాత్రమే అసోం ఉందనుకున్నాం. కానీ తాజా పరిస్థితులు చూస్తే రాష్ట్రంలోని వేలాదిమంది యవత ఈ మత్తు పదార్థాలకు బానిసలైనట్టు గుర్తించాం. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా.. వాటిని అక్రమంగా తరలిస్తూ పోలీసులను చూసి పారిపోయే వారిపై కాల్పులు జరిపిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. అందుకు పోలీసులు విమర్శలనూ ఎదుర్కొన్నారు. కానీ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఓ ముక్యమంత్రిగా నేను వారికి పూర్తి అధికారాలు ఇచ్చాను’’ అని తెలిపారు. 

గోల్‌ఘాట్‌ వద్ద సుమారు రూ.20 కోట్ల విలువైన 802 గ్రాముల హెరాయిన్, 1205 కిలోల గంజాయి, 3 కిలోల ఓపీయమ్‌, 2 లక్షలకుపైగా మాత్రలకు బహిరంగంగా నిప్పంటిస్తున్న దృశ్యాలను ట్విటర్లో  హిమంత బిశ్వశర్మ పోస్టు చేశారు. తాను సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 1493 మంది డ్రగ్‌ డీలర్లను అరెస్టు చేయడం సహా.. 874 కేసులను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో 18.82  కిలోల హెరాయిన్‌, 7944.72  కిలోల గంజాయి, 1.93 కిలోల మార్ఫిన్‌, 3 కిలోల మెతంఫిటమిన్‌, 3,313 కిలోల ఓపీయమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని