COVID19: మరో విజయం దిశగా ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు..

బ్రిటిష్‌-స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యతిరేక పోరాటానికి మరో ఆయుధాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆ కంపెనీ పరిశోధనలు డ్రగ్‌...

Published : 12 Oct 2021 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటిష్‌-స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యతిరేక పోరాటానికి మరో ఆయుధాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆ కంపెనీ పరిశోధనలు డ్రగ్‌ లాంగ్‌ యాక్టింగ్‌యాంటీ బాడీ(లాబ్‌) కాక్‌టెయిల్‌ తుదిదశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలను ఇచ్చింది. దీనిని AZD7442గా వ్యవహరిస్తున్నారు. ఈ ఔషధం తీవ్రమైన వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరని పేషెంట్లలో మరణాలను పూర్తిగా తగ్గించింది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిలో ఈ ఔషధం బాగా పనిచేసినట్లు మూడో విడత ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. వ్యాధి సోకకుండా ముందు జాగ్రతగా కూడా దీనిని వినియోగించవచ్చు. 

ఆసుపత్రిలో చేరని పేషెంట్లకు AZD7442 కాక్‌టెయిల్‌ను 600 ఎంజీ కండరాలకు ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చారు. ఇది తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలు రాకుండా అడ్డుకొంది. ఇక ప్లసిబోతో పోల్చుకొంటే మృత్యువు ముప్పును 50శాతం తగ్గించింది. పైగా ప్లసిబో తీసుకొన్న వారిలో కంటే ఈ కాక్‌టెయిల్‌ తీసుకొన్న వారిలో తక్కువ ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి. ఈ ప్రయోగంలో పాల్గొన్న 90 శాతం మంది ఆరోగ్య సమస్యలు ఉండి.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారే ఉన్నారు.

దీనిని ఎలా తయారు చేశారు

చికిత్సలోను, ముందుజాగ్రత్త చర్యగా వినియోగించే తొలి లాంగ్‌ యాక్టింగ్‌యాంటీ బాడీ(లాబ్‌) కాక్‌టెయిల్‌గా  AZD7442 నిలిచింది. దీనిని ఓ సాధారణ ఇంజెక్షన్‌ వలే వినియోగించవచ్చు. దీనిని టాక్సాగేవిమాబ్‌ (AZD8895), సిల్గవిమాబ్‌ (AZD1061) అనే రెండు రకాల లాబ్‌లను సమ్మిళతం చేసి దీనిని తయారు చేశారు. దీనిలో హఫ్‌లైఫ్ ఎక్స్‌టెన్షన్‌ టెక్నాలజీ వాడినట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొంది. ఈ కాక్‌టెయిల్‌ ఫలితం 6 నుంచి 12 నెలల వరకు ఉండవచ్చని అంచనావేస్తోంది. ఈ ప్రయోగానికి అమెరికా ప్రభుత్వం 486 మిలియన్‌ డాలర్ల సాయం కూడా అందించింది. ముందస్తు అత్యవసర వినియోగం అమెరికా ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేస్తున్నట్లు అక్టోబర్‌ 5వ తేదీ ఆస్ట్రాజెనెకా పేర్కొన్నట్లు నాస్‌డాక్‌ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని