Space: భారత్‌కు అంతరిక్షం నుంచి సందేశం..!

స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తవుతోన్న తరుణంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందన సందేశాలు వస్తున్నాయి.

Published : 13 Aug 2022 18:56 IST

దిల్లీ: స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తవుతోన్న తరుణంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందన సందేశాలు వస్తున్నాయి. ఇతర దేశాల నుంచే కాకుండా అంతరిక్షం నుంచి మనకు సందేశం వచ్చింది. దానిని ఇటలీకి చెందిన వ్యోమగామి సమంతా క్రిస్టోఫొరెట్టి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘75 ఏళ్ల స్వతంత్ర భారతావనికి అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉంది. దశాబ్దాలుగా ఎన్నో అంతరిక్ష మిషన్‌లలో అంతర్జాతీయ సంస్థలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తో కలిసిపనిచేశాయి. ఇస్రో.. నిస్సార్‌ (NISAR) ఎర్త్‌ సైన్స్‌ మిషన్‌ను అభివృద్ధి చేస్తున్నందున ఈ సహకారం మున్ముందు కొనసాగనుంది. మారుతున్న వాతావరణాన్ని, విపత్తులను అర్థం చేసుకోవడంలో ఈ మిషన్ మనకు ఉపయుక్తంగా ఉండనుంది’ అని వెల్లడించారు. అలాగే ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ గురించి ప్రస్తావించారు. దీనిపై ఇస్రో స్పందించింది. కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సమంత మాట్లాడుతోన్న వీడియోను షేర్ చేసింది.  

నాసా ఇస్రో సార్‌ మిషన్‌(NISAR)..దీనిని భారత్, యూఎస్‌ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. దీనిద్వారా అంతర్జాతీయంగా వచ్చే విపత్తులను ట్రాక్‌ చేయడానికి వీలు కలుగుతుంది. అందుకోసం తగిన సమాచారాన్ని అందిస్తుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని