Kabul Blasts: కాబుల్‌ పేలుళ్లలో తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు!

అఫ్గానిస్థాన్‌లో జరిగిన జంట పేలుళ్ల నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందే దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు....

Published : 27 Aug 2021 11:44 IST

కాబుల్‌: తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో జరిగిన జంట పేలుళ్ల నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందే దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు సిక్కు వర్గానికి చెందిన కొందరు తెలిపారు. వీరిలో 145 మంది సిక్కులు కాగా.. మరో 15 మంది హిందువులు. వీరంతా అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లడం కోసం సరిగ్గా పేలుళ్లు జరిగిన ప్రాంతంలోనే కొన్ని గంటల పాటు వేచి చూసినట్లు పేర్కొన్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల వారంతా తిరిగి అంతకుముందు ఆశ్రయం పొందిన గురుద్వారా కార్టె పర్వాన్‌కు చేరుకున్నారు. దీంతో ముప్పు నుంచి తప్పించుకున్నట్లైంది. ఈ విషయాన్ని కాబుల్‌ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు గుర్నం సింగ్‌ తమకు తెలిపినట్లు అకాలీ దళ్‌ అధికార ప్రతినిధి, దిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజీందర్‌ సింగ్‌ సీర్సా తెలిపారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ గురువారం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు నగరంలోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నిన్న సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 72 మంది దుర్మరణం చెందారు. చనిపోయినవారిలో తమ మెరీన్‌ కమాండోలు 11 మంది, ఒక నేవీ వైద్యుడు ఉన్నట్టు అమెరికా తెలిపింది. ఇది కచ్చితంగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల పనేనని పెంటగాన్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్‌, అమెరికా అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారు. అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్న వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భద్రతా బలగాలు అప్రమత్తం చేశాయి. అంతలోనే ముష్కరులు ఘాతుకానికి ఒడిగట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని