Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం!

దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దిల్లీలోని ఓ వాణిజ్య భవనంలో దట్టమైన మంటలు వ్యాపించి 27 మంది అగ్నికి ఆహుతయ్యారు......

Updated : 14 May 2022 00:15 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దిల్లీలోని ఓ వాణిజ్య భవనంలో దట్టమైన మంటలు వ్యాపించడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భవనంలో ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పశ్చిమ దిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలో భవనంలో మంటలు వ్యాపించగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 24 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేస్తున్నారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో చివరి ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు.. అనంతరం భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భవనంలో చిక్కుకుపోయిన దాదాపు 60-70 మందిని ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికిపైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో పలువురు భవనంపై నుంచి దూకారు. నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి తలా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున  ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు.  

రాష్ట్రపతి దిగ్భ్రాంతి..
దిల్లీ అగ్నిప్రమాద ఘటనపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.  

ఘటన చాలా బాధాకరం.. ఉపరాష్ట్రపతి
అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

చాలా బాధాకరమైన సంఘటన..  ప్రధాని మోదీ
అగ్నిప్రమాదం ఘటన చాలా బాధాకరమైన విషయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ సమయంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల గురించే తన ఆలోచనలు ఉన్నట్లు తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు.. హోం మంత్రి
దిల్లీ అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. 

షాక్‌కు గురయ్యా.. దిల్లీ ముఖ్యమంత్రి

ఈఘటన గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని, చాలా బాధపడ్డట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. సహాయకచర్యలపై అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, మంటలను ఆర్పివేసేందుకు ధైర్యవంతులైన తమ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. రాహుల్‌ గాంధీ

దిల్లీ అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

 

 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని