Sierra Leone: సియారా లియోన్‌లో ఘోర ప్రమాదం.. 91 మంది మృతి

పశ్చిమాఫ్రియాలోని సియారా లియోన్‌ రాజధాని రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలే. కాలిపోయిన శరీర భాగాలే. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 91 మంది మృతిచెందినట్లు సమాచారం......

Updated : 06 Nov 2021 19:25 IST

ఫ్రీటౌన్‌: పశ్చిమాఫ్రికాలోని సియారా లియోన్‌ రాజధాని రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలే. కాలిపోయిన శరీర భాగాలే. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 91 మంది మృతిచెందినట్లు సమాచారం. సియారా లియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో కొద్ది గంటల క్రితం ఓ ఇంధన ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. అయితే అందులోని ఇంధనం లీకవుతుండటంతో పలువురు అక్కడికి చేరుకొని దాన్ని సేకరించేయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ ట్యాంకర్‌ ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో ఇంధనాన్ని సేకరించేవారు తునాతునకలయ్యారు. అక్కడి దుకాణాలకు, రోడ్డున వెళ్లేవారికి సైతం మంటలంటుకున్నాయి. దీంతో ఎక్కడ చూసిన కాలిపోయి ఉన్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 91 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. పట్టణ మేయర్‌ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జూలియస్‌ మాడా బియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు, క్షతగాత్రులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని