Delhi Water Crisis: దిల్లీ నీటి సంక్షోభం.. పరిష్కరించకుంటే నిరవధిక దీక్ష: ఆతిశీ

దిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని రెండు రోజుల్లోగా పరిష్కరించకుంటే తాను నిరవధిక దీక్ష చేపడతానంటూ ఆప్‌ నేత ఆతిశీ.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. 

Published : 19 Jun 2024 15:05 IST

దిల్లీ: ఒకవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం దిల్లీ (Delhi) ప్రజలను పీడిస్తున్నాయి. నీటి కొరతతో నగరవాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని దిల్లీ ప్రభుత్వం కోరింది. నగరంలో నెలకొన్న నీటి ఎద్దడికి రెండు రోజుల్లో ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi)లేఖ రాసింది.

తమ నీటి వాటాను హరియాణా ప్రభుత్వం సరైన సమయానికి విడుదల చేయకపోవడంతో దిల్లీలో నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ‘‘వాటా ప్రకారం.. హరియాణా నుంచి దిల్లీకి 613 MGD (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) రావాల్సిఉంది. కానీ, మంగళవారం 513 MGDలను మాత్రమే విడుదల చేశారు. ఒక MGD నీరు 28,500 మంది అవసరాలకు వినియోగించవచ్చు. అంటే 28 లక్షల మందికి పైగా నీటి కొరతతో నరకం చూస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి ఎన్నోసార్లు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశాను’’ అని ఆప్‌ మంత్రి ఆతిశీ (Atishi) తెలిపారు.

ఐసీయూలో భార్య మృతదేహం చెంతే.. కాల్చుకొని ఐపీఎస్‌ బలవన్మరణం

ప్రస్తుతం హీట్‌వేవ్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న నగరవాసులకు నీటి సంక్షోభం కూడా తోడైందని దిల్లీ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీకి లేఖ రాశా. ఒకవేళ జూన్‌ 21 లోగా వారు స్పందించకపోతే.. నిరవధిక దీక్ష చేపడతా’’ అని ఆతిశీ స్పష్టంచేశారు. కాగా.. యమునా నదీ ప్రవాహం తగ్గడంతో దిల్లీ నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను కొంతైనా తగ్గించేందుకు నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అధికారిక బృందాలు గస్తీ కాస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని