Asaduddin Owaisi: అసదుద్దీన్‌పై కాల్పులు.. నిందితులకు బెయిల్‌పై వివరణ కోరిన సుప్రీంకోర్టు

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కారుపై కాల్పుల కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్‌ ఎందుకు మంజూరు చేశారో చెప్పాలంటూ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది

Published : 01 Oct 2022 00:26 IST

దిల్లీ: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్‌ మంజూరుపై వివరణ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిందితులు సచిన్‌ శర్మ, శుభం గుర్జార్‌లకు కూడా నోటీసులిచ్చింది. మూడో నిందితుడు అలీమ్‌కు బెయిల్‌ మంజూరును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ ఘటనతో అతడికి సంబంధం లేదని, సుమారు ఆరు నెలల కిందట అతడి నుంచి నిందితులు తుపాకీ కొనుగోలు చేసినట్లు ధర్మాసనం విశ్వసిస్తోందని స్పష్టం చేసింది. దీంతో అలీమ్‌ బెయిల్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను నవంబరు 11కి వాయిదా వేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తుండగా..హాపూర్‌-ఘజియాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద ఇద్దరు దుండగులు అసదుద్దీన్‌ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తూటాలు దూసుకెళ్లడంతో వాహనం టైర్లు పంక్చరయ్యాయి. అయితే ఈ ఘటనలో అసదుద్దీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే వేరే వాహనంలో ఆయన దిల్లీకి వెళ్లిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకొని అలహాబాద్‌ కోర్టులో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని