
Manipur Ambush: మయన్మార్ సరిహద్దు దాటి దాడి చేశారు: సీఎం బీరెన్ సింగ్
ఇంఫాల్: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు జరిపిన దాడిలో ఓ కమాండింగ్ అధికారి, ఆయన భార్య, కుమారుడితోపాటు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొందరు జవాన్లకు గాయలయ్యాయి. ఈ ఘటనను ఇప్పటికే ఖండించిన మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్.. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాన్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారు మయన్మార్ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడినట్లు తెలిపారు. వారు నాలుగు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చినట్లు వెల్లడించారు. ఆ ఉగ్రవాదులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ ఆపరేషన్లు మొదలుపెట్టాయని చెప్పారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సిబ్బంది జరిపిన కాల్పుల్లో కొంతమంది ఉగ్రవాదులు గాయపడి ఉండొచ్చని చెప్పారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలను గుర్తించినట్లు, వాటి ఆధారంగా ఆర్మీ, పోలీసుల వేట కొనసాగుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
అమరుల త్యాగం మరువలేనిదన్న ప్రధాని
ఉగ్రవాదుల దుశ్చర్యపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. అమరులైన సైనికులకు నివాళులు. వారి త్యాగం మరువలేనిది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కమాండింగ్ అధికారి, ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులతోపాటు నలుగురు వీర సైనికులను దేశం కోల్పోయిందని రాజ్‌నాథ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశాన్ని రక్షించే సామర్థ్యం మోదీ ప్రభుత్వానికి లేదన్న విషయం ఈ ఉగ్రదాడితో మరోసారి రుజువయిందని విమర్శించారు.