దిల్లీ పేలుళ్లు..2012నాటి దాడులు గుర్తొచ్చేలా!

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద 2012లో జరిగిన దాడిని తాజాగా దిల్లీలో చోటుచేసుకున్న ఘటన మరోసారి గుర్తుకు తెస్తోంది.

Published : 29 Jan 2021 22:31 IST

ఇరాన్‌ హస్తంపై మరోసారి అనుమానాలు

దిల్లీ: రైతుల ఆందోళనలతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. దిల్లీలో బాంబు పేలుడు ఘటన ఒక్కసారిగి ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం కాగా ఇప్పటివరకు ఎవ్వరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. కేవలం సంచలనం కోసమే అల్లరిమూకలు ఈ పని చేసి ఉండవచ్చని దిల్లీ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి సమీపంలోనే ఈ పేలుడు ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద 2012లో జరిగిన దాడిని తాజా ఘటన మరోసారి గుర్తుకు తెస్తోంది. ఆ దాడికి ఇరాన్‌ కారణమని అప్పట్లో వచ్చిన వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

2012నాటి ఘటనలోనూ..

తాజాగా దిల్లీలో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటన, 2012నాటి కారుబాంబు దాడిని గుర్తుకు తెస్తోంది. ఇజ్రాయెల్‌ ఎంబసీకి చెందిన టొయోటా ఇన్నోవా కారుపై బాంబు దాడి జరిగింది. బాంబు అమర్చిన ఓ బైక్‌ ఢీకొట్టడం వల్లే ఆ పేలుడు జరిగినట్లు అనుమానించారు. ఆ ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డారు. అదే సమయంలో జార్జియాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వాహనం వద్ద ఓ బాంబును పోలీసులు నిర్వీర్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా ఇజ్రాయెల్‌ రాయబార‌ అధికారులను టార్గెట్‌ చేస్తూ ఈ దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇది ఇరాన్‌ పనే అని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమెన్‌ నెతన్యాహు కూడా ఆరోపించారు. 2012 సంవత్సరంలో థాయిలాండ్‌, అజెర్‌బైజాన్‌ దేశాల్లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఇటువంటి దాడులు జరిగినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. ఇది ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యింది. అనంతరం జరిపిన దర్యాప్తులోనూ ఇరాన్‌ హస్తం ఉన్నట్లు తెలిసింది. అయితే, దీన్ని ఖండించిన ఇరాన్‌, అది ఉగ్రవాదుల పనే అని పేర్కొంది.

ఇవీ చదవండి..
సింఘులో మళ్లీ ఉద్రిక్తత
రైతు ఉద్యమకారులపై ఉచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు