Delhi Liquor Scam: నకిలీ కేసులో సిసోదియాను ఇరికించేందుకు ప్రయత్నించారు: కేజ్రీవాల్‌

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor scam) కేసులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేయడంపై ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) స్పందించారు.

Published : 25 Nov 2022 23:05 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor scam) కేసులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేయడంపై ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) స్పందించారు. దిల్లీలో మద్యం పాలసీ కుంభకోణం కేసు నకిలీదని.. ఆ కేసులో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తులో సిసోదియాకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదన్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఈరోజు ఛార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. ‘‘మనీశ్‌ సిసోడియా పేరు సీబీఐ ఛార్జిషీట్‌లో లేదు. ఈ మొత్తం కేసు నకిలీదే. సోదాల్లో ఏమీ బయటపడలేదు. మొత్తం 800 మంది అధికారులు నాలుగు నెలల దర్యాప్తులో గుర్తించిందేమీలేదు. విద్యారంగంలో విప్లవం తీసుకురావడం ద్వారా దేశంలోని కోట్ల మందిపేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనీశ్‌ ఆశించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పరువు తీసేందుకు కుట్రలు చేస్తున్నందుకు బాధపడుతున్నా’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తంచేశారు. 

మరోవైపు, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తొలి ఛార్జిషీట్‌ను శుక్రవారం దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో ఇద్దరు వ్యాపారులతో పాటు మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏ1గా అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌సింగ్‌ను, ఏ2గా అప్పటి అబ్కారీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేందర్‌సింగ్‌, ఏ3గా విజయ్‌ నాయర్‌, ఏ4గా అభిషేక్‌ బోయిన్‌పల్లి పేర్లతోపాటు సమీర్‌ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చినట్టు అధికారులు వెల్లడించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి తొలుత దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా పేరు మార్మోగింది. గతంలో సీబీఐ ఆయనకు సమన్లు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు