Ashok Gehlot: భాజపా హయాంలోనే బాలికల వేలం ఘటనలు.. రాజస్థాన్‌ సీఎం

రాజస్థాన్‌లో రుణాల చెల్లింపు వివాదాల పరిష్కారానికి.. స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కొట్టిపారేశారు. గతంలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా ఘటనలు జరిగాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టినట్లు తెలిపారు.

Published : 30 Oct 2022 01:36 IST

జైపుర్‌: రాజస్థాన్‌(Rajasthan)లో రుణాల చెల్లింపు వివాదాల పరిష్కారానికి.. స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం (Auctioning Girls) వేస్తున్నట్లు వచ్చిన వార్తలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) శనివారం వాటిని కొట్టిపారేశారు. గతంలో భాజపా(BJP) అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా ఘటనలు జరిగాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే బయటపెట్టినట్లు తెలిపారు.

‘2005లో రాష్ట్రంలో భాజపా హయాంలో ఈ ఘటనలు జరిగాయి. 2019లో మేం అధికారంలోకి వచ్చాక.. ఈ విషయాన్ని బయటపెట్టాం. మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశాం. మరో ముగ్గురు మృతి చెందారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇద్దరు బాధితులూ చనిపోయారు. మిగిలిన వారిని ఇళ్లకు చేర్చాం’ అని గహ్లోత్‌ శనివారం సూరత్‌లో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పరిశీలకుడిగా ఆయన ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. పలు వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ శుక్రవారం తెలిపారు. కొన్నేళ్లుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు భిల్వాఢా జిల్లాకు కమిషన్‌ బృందాన్ని పంపినట్లు వెల్లడించారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం ఈ విషయంపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సంగీత బేణీవాల్‌.. శనివారం భిల్వాఢా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ‘2019లో కాపాడిన ఆరుగురు బాలికల్లో నలుగురిని ఇళ్లకు చేర్చాం. మిగతా ఇద్దరిని.. బాలికల సంరక్షణ గృహాల్లో ఉంచాం’ అని అధికారులు వివరించారు. బాలికలతో మాట్లాడి త్వరలో పూర్తి వివరాలు తెలుసుకుంటానని సంగీత చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని