ఆస్ట్రేలియా జాతీయ గీతం మారింది.. ఎందుకంటే?

ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతున్న వేళ.. ఆస్ట్రేలియా మరో నూతన మార్పును ఆహ్వానించింది.

Published : 01 Jan 2021 18:40 IST

సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్న వేళ.. ఆస్ట్రేలియా మరో నూతన మార్పును ఆహ్వానించింది. తమ పురాతన సంస్కృతి, వారసత్వాలను మరింతగా ప్రతిబింబించేలా ఆ దేశ జాతీయ గీతంలో మార్పులు చేసింది.  ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ‘అడ్వాన్స్‌ ఆస్ట్రేలియా ఫెయిర్‌’ అనే ఆ దేశ జాతీయ గీతంలోని కొన్ని పదాల్లో మార్పు చేశారు. తమ దేశంలో ప్రాచీన కాలం నుంచి నివసిస్తున్న ఆదిమ తెగలకు చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ఆస్ట్రేలియా  ప్రభుత్వం ఇటీవల కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ గీతంలో ఈ మార్పు చేశామని ఆ ప్రభుత్వం ప్రకటించింది.

18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారు ఆస్ట్రేలియాలో కాలనీలు ఏర్పాటు చేసేందుకు వేలాది సంవత్సరాల ముందు నుంచే అక్కడ స్థానిక ఆదిమవాసులు నివసించేవారు. ఇప్పటి వరకు ఉన్న జాతీయగీతంలో ‘‘యంగ్‌ అండ్‌ ఫ్రీ’’ (యువత మరియు స్వేచ్ఛ) అనే పదబంధం స్థానంలో.. ఆ దేశ మూలాలను, చరిత్రను ప్రతిబింబించేలా ‘‘వన్‌ అండ్‌ ఫ్రీ’’ (ఏకత్వము మరియు స్వేచ్ఛ) అనే పదాలను ప్రవేశపెట్టారు. తొలి వాక్యం తమ పూర్వీకుల గొప్పదనాన్ని గుర్తించేదిగా లేదనే భావనను ఇటీవల లేవనెత్తారు. ఈ విధమైన భావనను తొలగించేందుకు న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్ర అధినేత గ్లాడీస్‌ బెరెజిక్లియన్‌ ఈ మార్పును ప్రతిపాదించారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం చేసిన ఈ ప్రకటనను.. ఆ దేశ  ప్రజలు స్వాగతించారు. ఈ మార్పు ఏకత్వ భావాన్ని ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ అన్నారు. ఈ కొత్త మార్పు వల్ల కోల్పోయిందేమీ లేకపోగా.. తమ జాతీయ గీతం మరింత అర్థవంతంగా మారిందని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

న్యూ ఇయర్‌లో కిమ్.. అరుదైన చర్య

కొత్త ఏడాదిలో కలిసికట్టుగా ముందుకు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని