Covid restrictions: అక్కడ బయట కనిపిస్తే జరిమానాలే..

కరోనా వైరస్‌ ఆస్ట్రేలియాను వణికిస్తోంది. అక్కడి ప్రధాన నగరాల్లో ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. దీంతో మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు....

Published : 15 Aug 2021 02:02 IST

సిడ్నీ: కరోనా వైరస్‌ ఆస్ట్రేలియాను వణికిస్తోంది. అక్కడి ప్రధాన నగరాల్లో ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. దీంతో మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు. బయట కనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద నగరమైన సిడ్నీ ప్రభుత్వం పేర్కొంది. ఎనిమిది వారాలపాటుగా సిడ్నీ లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ అక్కడ కొవిడ్‌ వ్యాప్తి తగ్గడం లేదు. ఈనేపథ్యంలోనే వైరస్‌ వ్యాప్తి కట్టడికి మరిన్ని కఠిన చర్యలను సిడ్నీ ప్రభుత్వం అమలుచేయనుంది. బయట కనిపిస్తే జరిమానాలు విధిస్తామని వెల్లడించింది.

సిడ్నీ రాష్ట్ర ప్రీమియర్‌ గ్లాడీ బెరెజిక్లియన్‌ శనివారం మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఎన్నడూ లేనన్ని కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మిగతా దేశాలకంటే ఆస్ట్రేలియాలో పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి’ అని తెలిపారు. చాలా దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియాలోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

కోటి మంది జనాభా ఉన్న ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోనూ వైరస్‌ను అదుపుచేయడం అక్కడి ప్రభుత్వానికి సవాలుగా మారింది. విస్తృతంగా వ్యాపిస్తున్న వైరస్‌ను కట్టడిచేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది తర్వాత న్యూ సౌత్‌వేల్స్‌లో తాజాగా లాక్‌డౌన్‌ విధించారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండేలా ఆస్ట్రేలియా వ్యాప్తంగా పోలీసులు, సైనిక బలగాలు పెట్రోలింగ్‌ నిర్వహించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని