Covaxin: కొవాగ్జిన్ తీసుకున్నవారు ఆస్ట్రేలియా వెళ్లొచ్చు..!

భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశానికి వచ్చేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సోమవారం

Published : 01 Nov 2021 17:50 IST

మెల్‌బోర్న్‌: భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశానికి వచ్చేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా థెరప్యూటిక్‌ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(టీజీఏ) నేడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కొవిషీల్డ్‌ టీకాను ఆస్ట్రేలియా గుర్తించగా.. తాజాగా కొవాగ్జిన్‌కు కూడా ఆమోదం తెలిపింది. 

విదేశీ ప్రయాణికుల వ్యాక్సిన్‌ స్టేటస్‌లో కొవాగ్జిన్‌(భారత్‌ బయోటెక్‌, ఇండియా),  బీబీఐబీపీ-కోర్‌వీ(సినోఫార్మ్‌, చైనా) టీకాలను గుర్తిస్తున్నట్లు టీజీఏ వెల్లడించింది. కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 12ఏళ్ల పైబడిన వారు, బీబీఐబీపీ-కోర్‌వీ టీకా రెండు డోసులు తీసుకున్న 18-60ఏళ్ల వారికి తమ దేశంలోకి అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికులు, విదేశీ విద్యార్థులు, నైపుణ్యమైన సిబ్బంది తిరిగి ఆస్ట్రేలియా వచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. కరోనా దృష్ట్యా దాదాపు 20 నెలల పాటు సరిహద్దులు, అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ టీకాలకు గుర్తింపునిచ్చింది. 

కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పటికే చాలా దేశాలు ఈ టీకాను గుర్తించాయి. ఆస్ట్రేలియా కంటే ముందు మారిషస్‌, ఒమన్‌, ఫిలిప్పీన్స్‌, నేపాల్‌, మెక్సికో, ఇరాన్‌, శ్రీలంక, జింబాబ్వే దేశాలు ఈ టీకాకు ఆమోదం తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని