
Taiwan: చైనా- తైవాన్ ఉద్రిక్తతలపై ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు
మెల్బోర్న్: చైనా- తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తైవాన్ భద్రత విషయంలో అవసరమైతే తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. తైవాన్ను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. ఆస్ట్రేలియా వారితో చేరకపోవడం అనూహ్యమే అవుతుందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పీటర్ డటన్ శనివారం ఓ వార్తాసంస్థతో అన్నారు. ‘తైవాన్ విషయంలో చాలా స్పష్టంగా, నిజాయతీగా ఉండాలని భావిస్తున్నాం. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మేం ముందుకు రాలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ.. అలా జరుగుతుందని ఊహించలేను’ అని డటన్ అన్నారు.
తైవాన్ను స్వాధీనం చేసుకోవాలనే విషయమై చైనా చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు భారీ స్థాయి సంసిద్ధత అవసరమని డటన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. తైవాన్ విషయంలో చైనా తన బలాన్ని ప్రయోగిస్తే.. అమెరికా, దాని మిత్రపక్షాలు తగు చర్యలు తీసుకుంటాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చైనా సైతం.. తైవాన్‌లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం పర్యటనను ఖండించింది. తైవాన్ దిశగా పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపింది.
జపాన్‌కు అండగా అమెరికా!
చైనా తమవని పేర్కొంటున్న ద్వీపాలతోపాటు జపాన్‌నూ రక్షించే విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తమకు హామీ ఇచ్చినట్లు జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి శనివారం వెల్లడించారు. తూర్పు చైనా సముద్రంలో జపాన్ ఆధ్వర్యంలోని సెంకాకు దీవుల విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో పరిస్థితులను మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలను హయాషి, బ్లింకెన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు జపాన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇవీ చదవండి
Advertisement