భారత్‌పై నిషేధం: సమర్థించుకున్న ఆస్ట్రేలియా!

కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న భారత్‌ నుంచి వచ్చే తమ ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఆస్ట్రేలియా సమర్థించుకుంది. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పష్టం చేశారు.

Published : 04 May 2021 01:11 IST

దేశ ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయమన్న ప్రధాని మారిసన్‌

దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న భారత్‌ నుంచి వచ్చే తమ ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఆస్ట్రేలియా సమర్థించుకుంది. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పష్టం చేశారు. భారత్‌లో నెలకొన్ని సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆస్ట్రేలియాలో మూడో దశ విజృంభణ రాకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు.

‘కరోనా వైరస్ విజృంభణతో భారత్‌లో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ సమయంలో భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇక్కడ వైద్యాధికారులు స్పష్టంగా పేర్కొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆస్ట్రేలియాలో మూడో దశ విజృంభణను అడ్డుకొనేందుకు గానూ మా క్వారంటైన్‌ వ్యవస్థ బలంగా ఉంచేందుకే తాత్కాలికంగా ఈ నిషేధం విధించాం. అంతేకాకుండా ఈ క్వారంటైన్‌ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషిచేస్తున్నాం’ అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు. ముందస్తుగా నమోదు చేసుకున్న 20వేల మంది ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకువచ్చామన్నారు. నిషేధంపై వస్తోన్న విమర్శలపై స్పందించిన ఆయన.. గత ఏడాది నుంచి బయోసెక్యూరిటీ యాక్ట్‌ అమలులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరినీ జైలుకు పంపించలేదని గుర్తుచేశారు.

ప్రధాని మారిసన్‌పై మండిపడ్డ విపక్షాలు..

తమ పౌరులు ఎవరైనా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తే వారికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.38లక్షలు (66వేల ఆస్ట్రేలియా డాలర్లు) మేర జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ నిషేధం నేటి నుంచే(మే 3) నుంచే అమలులోకి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా దేశ చరిత్రలోనే తొలిసారి తమపౌరులపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఆస్ట్రేలియన్లను భారత్‌లో అలా వదిలేయడమే కాకుండా జైలుకు పంపిస్తామని బెదిరించడంపై అక్కడి ప్రతిపక్ష నేత ఆంథోని ఆల్బనీస్‌ ప్రధాని మారిసన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలేకాని బెదిరించడం ఏంటని మరికొందరు విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు.

దిలాఉంటే, ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు మొత్తం 29,779 కేసులు నమోదు కాగా 910 మరణాలు సంభవించాయి. భారత్‌లో మాత్రం కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు నాలుగు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లోనే 3లక్షల 68వేల మందిలో వైరస్‌ పాజిటీవ్‌గా నిర్ధారణ కాగా.. 3417 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2లక్షల 18వేలు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని