Holi: హోలీ వేళ.. భారతీయుల పట్ల అభిమానం చాటుకున్న ఆస్ట్రేలియా ప్రధాని

హోలీ పండగ వేళ.. ఆస్ట్రేలియాలో నివసిస్తోన్న భారత సంతతికి ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ల పట్ల భారతీయులు చూపుతున్న శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు. 

Published : 18 Mar 2022 12:09 IST

దిల్లీ: హోలీ పండగ వేళ.. ఆస్ట్రేలియాలో నివసిస్తోన్న భారత సంతతికి ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ల పట్ల భారతీయులు చూపుతున్న శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు. 

‘ఈ సంవత్సరం హోలీ మరింత అర్థవంతంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి వేళ.. మనకు అందిన సహకారంపై కృతజ్ఞతతో ఉండాలి. ఈ పండగ వేళ ఆస్ట్రేలియాలోని భారత సంతతికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు మీ కుటుంబాల పట్లే కాకుండా ఆస్ట్రేలియన్లందరీ పట్ల చూపిన ప్రేమ, శ్రద్ధకు సంతోషం. చాలా కాలం తర్వాత ఈ వేడుకలు మనల్ని దగ్గర చేశాయి. ఈ వాతావరణం భవిష్యత్తు కోసం ఆశతో సాగేలా స్ఫూర్తినిస్తుంది’ అంటూ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ఆ సందేశాన్ని ట్విటర్‌లో షేర్ చేసి, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. 

ఇక మోరిసన్ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్‌పై తన అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. మన వంటల గురించి పలుమార్లు ప్రస్తావించారు. మన ప్రధాని మోదీ, ఆయన మధ్య జరిగే చర్చల్లో పలుమార్లు ఈ సరదా సంభాషణలు వినిపించిన సంగతి తెలిసిందే. ‘సండే స్కోమోసా విత్ మ్యాంగో చట్నీ’ అంటూ మోరిసన్ తాను తయారు చేసిన సమోసా గురించి వెల్లడించి భారతీయుల్ని ఆకట్టుకున్నారు. అలాగే మోదీకి కిచిడీ ఇష్టమని తెలుసుకున్న ఆయన.. ఈ సారి కలిసినప్పుడు దానిని రుచి చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. అందుకు మోదీ చిరునవ్వు చిందిస్తూ.. ఆయన ఆఫర్‌కు ఓకే చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని