
భారత్.. ఎలుకల్ని చంపే విషం ఎగుమతి చేయవా?
అభ్యర్థిస్తోన్న ఆస్ట్రేలియన్ స్టేట్
సిడ్నీ: కరోనా కట్టడి కోసం భారత్‌కు చెందిన రెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. వాటిని తమ దేశాలకు ఎగుమతి చేయాలంటూ అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తోన్న వేళ.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం మాత్రం భారత్‌ను మరో విచిత్రమైన సాయం అడుగుతోంది. ఎలుకల్ని చంపడానికి ఉపయోగించే ప్రమాదకర విషం బ్రోమాడియోలోన్‌ను సరఫరా చేయాలని కోరుతుంది.
ఇటీవల గ్రామీణ ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద తీవ్రమైంది. పెద్ద సంఖ్యలో ఎలుకలు పంటలపై దాడి చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. నిత్యం వేలకొద్ది ఎలుకల మృత దేహాలు వ్యవసాయ క్షేత్రాల్లో బయటపడుతున్నాయి. వాటి వల్ల ప్లేగు వ్యాధి ప్రబలుతుండటంతో అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలుకల్ని చంపడానికి బ్రోమాడియోలోన్‌ను ప్రయోగించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం ఎలుకలతోపాటు జీవకోటికి ప్రమాదకరం. అందుకే ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు బ్రోమాడియోలోన్‌ను నిషేధించాయి.
కాగా.. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం మాత్రం తమ ప్రాంతంలో ఎలుకల్ని చంపడానికి 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్ విషాన్ని ఎగుమతి చేయాలని భారత్‌ను కోరుతోంది. ఇందుకోసం 50మిలియన్ డాలర్ల నిధులను సైతం విడుదల చేసింది. అయితే, న్యూ సౌత్ వేల్ ప్రతిపాదనకు ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషం వల్ల మిగతా జంతువులకు ప్రాణహాని ఉంటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి న్యూ సౌత్ వేల్స్ అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం.. భారత్ ఆమోదిస్తాయో లేదో చూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.