ఆటో డ్రైవర్‌ మాత్రమే కాదు.. ఆర్థిక పాఠాలూ చెబుతాడు!

బెంగళూరుకు (Bengaluru) చెందిన జనార్ధన్‌ (Janardhan) అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలను వివరించేందుకు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలు పెట్టాడు.

Published : 18 Mar 2023 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డ్రెస్సింగ్‌ స్టైల్‌, చేస్తున్న పనిని బట్టి ఎవరి టాలెంట్‌నూ అంచనా వేయలేం. ఈ మధ్య కాలంలో సాదాసీదాగా కనిపిస్తున్న ఎంతో మంది అంకుర సంస్థలు ఏర్పాటు చేసి వ్యాపార వేత్తలుగా ఎదుగుతున్నారు. ఖాళీ సమయాల్లో పార్ట్‌టైం ఉద్యోగంగా మొదలు పెట్టి.. దాన్నే ఓ కెరీర్‌గా మలచుకునేవాళ్లూ లేకపోలేదు. అలాంటి వారే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే ఈ ఆటో డ్రైవర్‌.

జనార్ధన్‌.. బెంగళూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజంతా కష్టం చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందులో వింతేముంది.. చాలా మంది చేసే పనే కదా అనుకోవచ్చు. అలాగైతే అసలు వార్తల్లోకి ఎందుకొస్తారు?  జనార్ధన్‌కు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్‌ మీద మంచి పట్టుంది. దీనిని ఎలాగైనా తనకు అవకాశంగా మలచుకోవాలనుకున్నారు. ‘గోల్డ్‌ జనార్ధన్‌ ఇన్వెస్టర్‌’ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలు పెట్టారు. వీలుదొరికినప్పుడల్లా కొన్ని వీడియోలు అందులో పోస్టు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తన ఆటోలో డ్రైవర్‌ సీట్‌ వెనుక దీనికి సంబంధించిన ఓ బ్యానర్‌ను కూడా అంటించారు. యూట్యూబ్‌ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందిగా కోరారు. ఇలా, తన ఛానెల్‌కు ప్రచారం కల్పించుకున్నారు.

‘ద్రవ్య లోటు ఉన్నప్పుడు కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంకు ఇబ్బడిముబ్బడిగా ప్రింట్‌ చేసేయొచ్చు కదా.. అలా ఎందుకు చేయడం లేదు? ప్రస్తుతం భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? బంగారంపై పెట్టుబడులు మంచిదేనా? ’ ఇలా విభిన్న అంశాలపై తనదైన శైలిలో వివరణ ఇస్తూ వీడియోలను పోస్టు చేశారు. దీంతో ఆయన విశ్లేషణలపై ఆకర్షితులైన ఎంతో మంది ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేయడం మొదలు పెట్టారు. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, వివిధ గ్రాఫ్‌లు, చిత్రాలతో వివరించడం జనార్ధన్‌ ప్రత్యేకత. అంతేకాకుండా సమకాలీన అంశాలనే తీసుకొని విశ్లేషిస్తుంటారు. అయితే, కేవలం కన్నడ భాషలోనే అతడు వివరణ ఇస్తుండటంతో ఇతర భాషల వారు సరిగా అర్థం చేసుకోలేకపోవడం సమస్యగా మారింది. ఏదేమైనా ఓ సాధారణ వ్యక్తి.. యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలు పెట్టి.. తద్వారా ఆర్థిక పరమైన అంశాలను వివరిస్తూ.. దాన్నే కెరీర్‌గా మలచుకోవడానికి ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమే కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని