Yogi Adityanath: అయోధ్యలో సీఎం యోగికి గుడి.. విగ్రహానికి రోజూ పూజలు!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) పట్ల అభిమానంతో ఏకంగా గుడినే కట్టించాడో యువకుడు. భరత్‌కుండ్‌ సమీపంలోని....

Published : 19 Sep 2022 18:10 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) పట్ల అభిమానంతో ఏకంగా గుడినే కట్టించాడో యువకుడు. భరత్‌కుండ్‌ సమీపంలోని పుర్వా గ్రామంలో రాముడి అవతారంలో ఉన్నట్టుగా యోగి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ఏర్పాటు చేశాడు అయోధ్యకు చెందిన 32 ఏళ్ల ప్రభాకర్‌ మౌర్య. రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తూ యోగి పట్ల తన ఆరాధనా భావాన్ని చాటుకొంటున్నాడు. తనను ‘యోగికి ప్రచారక్‌’గా పేర్కొంటున్న  మౌర్య.. సీఎం నిజజీవితంలో ఎలా ఉంటారో దాదాపు అదే శైలిని ప్రతిబింబించేలా నిలువుపాటి విగ్రహాన్ని తయారు చేయించాడు. కాషాయ వస్త్రధారణతో చేతిలో విల్లు, బాణంతో శ్రీరాముడు విగ్రహాన్ని పోలినట్టుగా గుడిలో ప్రతిష్ఠించాడు.  శ్రీరాముడిని పూజించినట్టే యోగి విగ్రహం ముందు రోజూ శ్లోకాలు పఠిస్తుంటానని యువకుడు పేర్కొన్నాడు. 

పొలం లేదు.. జాబ్‌ లేదు.. ఆ డబ్బుతోనే గుడి కట్టించా!

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వ్యక్తిని ఆరాధించాలని 2015లోనే ప్రభాకర్‌ మౌర్య ప్రతిజ్ఞ చేసుకున్నారట. ఇందులో భాగంగానే ఇప్పుడు యోగికి గుడి కట్టించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నట్టు చెబుతున్నారు మౌర్య.  ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేస్తోన్న తీరు తనకు బాగా నచ్చిందని.. అందువల్లే యోగికి దైవస్థానం దక్కిందన్నారు. గుడి కట్టించాలన్న ఆలోచన కూడా తనకు అందుకే వచ్చిందని మీడియాకు తెలిపారు. తనకు భూమిగానీ, ఉద్యోగం గానీ లేదని.. యూట్యూబ్‌లో భజనలు, మతపరమైన పాటలను పోస్ట్‌ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.లక్ష దాకా సంపాదిస్తానని చెప్పుకొచ్చారు.  ఆ డబ్బుతోనే ఈ గుడి కట్టించానన్నారు. అయితే, ఈ గుడి నిర్మించడానికి దాదాపు రూ.8.5లక్షల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. అలాగే, రాముడి అవతారాన్ని పోలి ఉండేలా యోగి విగ్రహాన్ని రాజస్థాన్‌లో ఆర్డర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయోధ్యకు దాదాపు 25కి.మీల దూరంలో ఉన్న భరత్‌కుండ్‌ ప్రాంతాన్ని రాముడు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన ప్రదేశంగా విశ్వసిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు