Tele consultation: లక్ష ఆరోగ్య కేంద్రాల్లో టెలీ-కన్సల్టేషన్‌ సేవలు.. ఎప్పటినుంచంటే!

ఏప్రిల్ 16 నుంచి దేశవ్యాప్తంగా లక్ష ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లలో 'ఈ-సంజీవని' టెలి-కన్సల్టేషన్ సేవలు  ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన...

Published : 16 Apr 2022 01:58 IST

దిల్లీ: ఏప్రిల్ 16 నుంచి దేశవ్యాప్తంగా లక్ష ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లలో ‘ఈ-సంజీవని’ టెలి-కన్సల్టేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఏప్రిల్‌ 16న దేశవ్యాప్తంగా లక్ష కేంద్రాల్లో ఈ-సంజీవని టెలీ-కన్సల్టేషన్‌ సేవలు ప్రారంభించనున్నాం. ఇప్పుడు సామాన్యులూ.. దేశంలోని పెద్ద పెద్ద వైద్యుల వద్ద నుంచి సలహాలు పొందవచ్చు’ అని రాసుకొచ్చారు. ప్రధాని ఆయుష్మాన్‌ భారత్‌ సంకల్పాన్ని.. ఈ కేంద్రాలు నెరవేర్చుతున్నాయన్నారు.

ఇటీవలే మాండవీయ.. వెల్‌నెస్‌ కేంద్రాలు, టెలి-కన్సల్టేషన్ సేవల కార్యాచరణ స్థితిపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, సీనియర్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1.17 లక్షల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అంతకుముందు.. వేరే కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని భుజ్‌లో ఓ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు.. కేవలం వ్యాధుల చికిత్సకే పరిమితం కాకుండా సామాజిక న్యాయాన్ని ప్రమోట్‌ చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. పేదలకు చౌకైన, ఉత్తమమైన చికిత్స అందుబాటులోకి వచ్చినప్పుడే.. వ్యవస్థపై వారి విశ్వాసం బలపడుతుందని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని