Azadi Ka Amrit Mahotsav: ముక్కుల ఆధారంగా ఆర్య-ద్రావిడ ముద్ర

1857 తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం... భారత్‌ను ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, రాజకీయంగానూ అల్లకల్లోలం చేసింది. విభజించు- పాలించు సూత్రాన్ని విస్తరించి... భారత సమాజంలో నేటికీ విప్పలేని చిక్కుముడులు వేసింది. సామాజిక శాస్త్రం పేరుతో ఆంగ్లేయులు

Updated : 27 May 2022 11:04 IST

1857 తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం... భారత్‌ను ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, రాజకీయంగానూ అల్లకల్లోలం చేసింది. విభజించు- పాలించు సూత్రాన్ని విస్తరించి... భారత సమాజంలో నేటికీ విప్పలేని చిక్కుముడులు వేసింది. సామాజిక శాస్త్రం పేరుతో ఆంగ్లేయులు తమ ప్రయోగాలకు భారత్‌ను వేదిక చేసుకున్నారు. తమకు అప్పటిదాకా తెలియని, అర్థంగాని, కొత్తవైన వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థలపై సొంత సిద్ధాంతాలు రుద్దారు. అందులో ఒకటి ముక్కు కొలతల (నాసల్‌ ఇండెక్స్‌) ఆధారంగా భారతీయులను విభజించటం!

ఈస్టిండియా కంపెనీ మాదిరిగా కేవలం ఆర్థిక దోపిడీకి మాత్రమే పరిమితం కాకుండా... భారత్‌ అనే బంగారు బాతును శాశ్వతంగా తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంది ఆంగ్లేయ సర్కారు. ఇందుకోసం తమ వలస ప్రజల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించింది. అప్పటిదాకా జాతి మాత్రమే తెలిసిన ఆంగ్లేయులకు ఇక్కడి వర్ణ, కుల వ్యవస్థలు ఒకపట్టాన అర్థంకాలేదు. ఏకరూపతకు అలవాటు పడ్డ వారికి భారత్‌లోని సామాజిక భిన్నత్వం అనూహ్యంగా అనిపించింది. భిన్న మతాలు, కులాలు, భాషలు... వాటికి వృత్తులతో అనుబంధం తెల్లవారికి కొరకరాని కొయ్యలా తయారైంది.

ప్రతి దానికీ ఓ క్రమం... ఉండాలని భావించే ఆంగ్లేయులు... తమకు గందరగోళంగా ఉన్న భారతీయ సామాజిక వ్యవస్థనూ వర్గీకరించటానికి నడుంబిగించారు. అప్పటికే విభజించు పాలించు సిద్ధాంతాన్ని మతపరంగా హిందూ-ముస్లింల మధ్య చిచ్చుకు వాడుకున్న ఆంగ్లేయులు... భారతీయ సామాజిక వ్యవస్థలో కూడా ఈ విభజన బీజాలు నాటారు. సర్‌ హెర్బర్ట్‌ హోప్‌ రిస్లే... ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా మొదలైంది. మొట్ట మొదటగా... భారతీయులను ముక్కు కొలతల ఆధారంగా ఆర్య, ద్రావిడులుగా విభజించాడు. జాతుల శాస్త్రం (రేస్‌ సైన్స్‌) పేరుతో శాస్త్రీయత ముసుగులో భారత్‌పై తన సిద్ధాంతాన్ని రుద్దాడు రిస్లే!

1873లో ఐసీఎస్‌ అధికారిగా భారత్‌కు వచ్చిన రిస్లే చాలాకాలం బెంగాల్‌ రాష్ట్రంలో పనిచేశాడు. తర్వాత భారత జనగణన కమిషనర్‌గా నియమితుడయ్యాడు. ఆంగ్లేయులది ఆధిపత్య జాతి అని నమ్మే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రిస్లే... బెంగాల్‌లోని వివిధ ఆదివాసీల సంప్రదాయాలు, అలవాట్లపై పరిశోధన చేశాడు. ఇదే సమయంలో... 19వ శతాబ్ది ఫ్రెంచ్‌ ఆంత్రోపాలజిస్టు పాల్‌టోపినార్డ్‌ ప్రతిపాదించిన ముక్కు కొలత సిద్ధాంతం ఆధారంగా రిస్లే భారతీయులపై తన భావనలను సంధించాడు.  ముక్కుల వెడల్పు, ఎత్తులను సేకరించటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ పురుషుల ముక్కులను కొలవటానికి ప్రయత్నించారు. చాలామటుకు ప్రతిఘటన ఎదురవటం; సర్వేకు వెళ్లినవారు సరైన సమాచారం ఇవ్వలేకపోవటంతో... చివరకు... జైళ్లలో మగ్గుతున్నవారి నుంచి కొలతలు సేకరించారు. ఆ వివరాలతో బెంగాల్‌ ఆదివాసీలు, కులాలు అంటూ 1891లో ఓ పుస్తకాన్ని ప్రచురించాడు రిస్లే! ఈ పుస్తకం వేసే సమయంలో ఇంగ్లాండ్‌ వెళ్లి అక్కడి, జర్మనీ సామాజిక శాస్త్రవేత్తలతో చర్చలు జరిపి వచ్చాడు. సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలకు భారత్‌ బంగారు గని అంటూ పరిస్థితిని వారికి వివరించాడు. భారత్‌లో ఆంత్రోపాలజీ పరిశోధన సంస్థను ప్రతిపాదించాడు. ఈ లాబీయింగ్‌తో భారత్‌లో అధికారిక ఆంత్రోపాలజిస్టు హోదా సంపాదించాడు. తద్వారా సామాజిక అంశాలపై రిస్లే మాట బ్రిటిష్‌ ప్రభుత్వానికి కీలకంగా మారింది.

ముక్కు కొలత ఆధారంగా..
భారతీయులను రెండు జాతులుగా రిస్లే వర్గీకరించాడు. 1. నల్ల చర్మ ద్రావిడ జాతి 2. తెల్లగా ఉండే ఆర్యజాతి. వీరిలో...  ద్రావిడులను ఆదివాసులుగా, నిమ్న జాతిగా... ఆర్యులను నాగరికులుగా, అగ్రజాతిగా రిస్లే ముద్రవేశాడు. కులాలే జాతులని, కులాల సామాజిక హోదా అనేది...వృత్తులపై కాకుండా... వారి ముక్కు కొలతకు విలోమానుపాతంలో ఉంటుందని రిస్లే వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి భారతీయులపైనా, కులాలపైనా యూరోపియన్‌ పరిశోధకులకు రిస్లే ప్రతిపాదనలే ఆధారమవుతూ వస్తున్నాయి. భారతీయ కులవ్యవస్థపై పరిశోధించి, విస్తారంగా రాసిన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ లాంటివారు రిస్లే ముక్కు సిద్ధాంతాన్ని, దాని ఆధారంగా భారతీయుల వర్గీకరణను తోసిపుచ్చటం గమనార్హం. ‘రిస్లే ముక్కు కొలతల ప్రకారం చూస్తే... బ్రాహ్మణులు, అంటరానివారు ఒకే జాతికి చెందినవారు. అంటే బ్రాహ్మణులు ఆర్యులైతే అంటరానికులాల వారూ ఆర్యులే. బ్రాహ్మణులు ద్రావిడులైతే అంటరానివారూ ద్రావిడులే. ఇది తప్పుడు భావనలపై చేసిన సిద్ధాంతం’ అని అంబేడ్కర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని