Updated : 14 Jun 2022 08:14 IST

Azadi Ka Amrit Mahotsav: మరో 1857 కోసం...

స్వాతంత్య్ర సమరంలో విదేశీ సాయంతో ఆంగ్లేయులను అల్లాడించిందెవరనగానే సుభాష్‌ చంద్రబోస్‌ అని చెబుతామంతా! కానీ ఆయనకంటే 30 సంవత్సరాల ముందే... ఆ పని చేశాడో యువకుడు. జర్మనీ అండతో బ్రిటిష్‌ను గడగడలాడించి... చివరకు వంచకుల మోసానికి బలైన వీరుడు జతీంద్రనాథ్‌ ముఖర్జీ.. ఉరఫ్‌ బాఘా జతిన్‌!

‘ఆయనే ఆంగ్లేయుడై ఉంటే... లండన్‌లో భారీ విగ్రహం పెట్టి గౌరవించేవాళ్లం. ఆయన ప్రణాళిక ప్రకారం ఆయుధాలు భారత్‌కు చేరి ఉంటే... మేం ఓడిపోయేవాళ్లం!’ ఆంగ్లేయుల ఈ నివాళి చాలు భారత స్వాతంత్య్ర సమరంలో జతీంద్రనాథ్‌ పాత్ర ఎలాంటిదో తెలియజేయటానికి. అవిభాజ్య బెంగాల్‌లోని కాయా గ్రామంలో 1879లో జన్మించిన జతిన్‌ చిన్నప్పటి నుంచీ ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. ఓసారి ఊర్లో రాయల్‌ బెంగాల్‌ పులితో జతిన్‌ 3 గంటలసేపు పోరాడి గెలిచాడు. అప్పటి నుంచి బాఘా జతిన్‌గా పేరు స్థిర పడింది. కాలేజీ చదువుకు కలకత్తా వచ్చాక రామకృష్ణ మిషన్‌ చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వివేకానందుడి శిష్యురాలు సిస్టర్‌ నివేదితతో పరిచయమైంది. జతిన్‌ను ఆమె వివేకానందుడి వద్దకు తీసుకెళ్లారు.

దేశ సేవకు భారతీయ యువతరాన్ని మేల్కొల్పాలన్న స్వామీజీ సూచన జతిన్‌లో నాటుకుంది. తర్వాత అరబిందోఘోష్‌తో సాన్నిహిత్యం ఆయన్ను స్వాతంత్య్ర సమరంలోకి దించింది. బెంగాల్‌ విభజనతో ప్రజలంతా ఆంగ్లేయులపై ఆగ్రహంతో కుతకుతలాడుతున్న దశ అది! బ్రిటిష్‌వారిపై పోరుకు ఓ రహస్య వ్యవస్థను సృష్టించాలన్న అరబిందో ఆదేశాల మేరకు... యుగాంతర్‌ను ఆరంభించారు జతిన్‌. విప్లవవాద సంస్థ అనుశీలన్‌ సమితి రహస్య వ్యవస్థే ఈ యుగాంతర్‌. దేశాన్ని నిద్రలేపేందుకు మనం మరణిద్దాం అంటూ జతిన్‌ ఇచ్చిన పిలుపునకు యువత ఉత్సాహంగా స్పందించి యుగాంతర్‌లో చేరారు. దియోగఢ్‌లో (ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది) బాంబుల తయారీ కర్మాగారం సైతం ఆరంభించారు. ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉండి భారత స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న విప్లవవాదులతో జతిన్‌కు దోస్తీ కుదిరింది. ఆ సమయంలో బెంగాల్‌, చుట్టుపక్కల ఆంగ్లేయులపై విప్లవ దాడులన్నీ యుగాంతర్‌ కనుసన్నల్లో జరిగినవే. అయితే ఈ చిన్నచిన్న దాడులు కాకుండా... ఆంగ్లేయులను తరిమేసేందుకు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలాంటి భారీ సాయుధ తిరుగుబాటు అవసరమని భావించిన జతిన్‌ ఆ దిశగా పావులు కదిపారు. కలకత్తాలోని భారతీయ సిపాయిలతోనూ రహస్యంగా సమాలోచనలు సాగాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం కోసం ఆంగ్లేయ సైన్యం భారీగా దేశం విడిచి వెళ్లింది. భారత్‌లో కేవలం 15వేల మంది మాత్రమే ఉన్నారు. బ్రిటిష్‌ సర్కారుపై దాడికి ఇదే సరైన సమయం అని భావించారు జతిన్‌. అంతకుముందు 1912లో కలకత్తా వచ్చిన జర్మనీ యువరాజుతో సమావేశమైనప్పుడు... ఆయుధ సాయంపై ఒప్పందం కుదిరింది. జర్మనీ వేదికగా పనిచేస్తున్న విప్లవవాదుల ఆర్థిక సాయంతో... ఆయుధాలను ఓడలో భారత్‌కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. తొలుత అండమాన్‌తో మొదలెట్టి కలకత్తా వరకు భారీస్థాయిలో ఆంగ్లేయులపై దాడిని విస్తరించాలని వ్యూహం రచించారు.  1915 డిసెంబరు 25న కలకత్తాను స్వాధీనం చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌ ఓడరేవు వద్ద జర్మనీ ఆయుధాలను దించుకోవాలనుకున్నారు. తన అనుచరులతో కలసి ముందే ఒడిశాకు చేరుకున్న జతిన్‌... అక్కడ ఆంగ్లేయులకు అనుమానం రాకుండా రామానంద స్వామి అనే సాధువు రూపంలో... హోమియోపతి వైద్యుడిగా అవతారం ఎత్తారు. జర్మనీ ఆయుధ ఓడ కోసం ఎదురు చూడసాగారు.

ఎస్‌.ఎస్‌.మావెరిక్‌ పేరుగల నౌక జావా మీదుగా బాలాసోర్‌కు బయల్దేరింది. అందులో 30వేల రైఫిళ్లు, భారీ మందుగుండు సామగ్రి, నగదు ఉన్నాయి. దురదృష్టవశాత్తు విప్లవకారుల ప్రణాళిక ఆంగ్లేయులకు తెలిసిపోయింది. ఆయుధాలతో వస్తున్న ఓడను అడ్డుకున్నారు. ఒడిశాలో... జతిన్‌ను పట్టుకోవటానికి పోలీసులు బయల్దేరారు. ఏదో తేడా ఉందని ఉప్పందిన జతిన్‌ సహచరులతో కలసి వెంటనే మహులిదిహా గ్రామం నుంచి మకాం మార్చి... బాలాసోర్‌కు కాలినడకన చేరుకున్నారు. స్థానిక వంచకులు ఇచ్చిన సమాచారంతో బెంగాల్‌ పోలీసు కమిషనర్‌ చార్లెస్‌ టెగార్ట్‌ సారథ్యంలో సైనిక దళం బాలాసోర్‌ను చుట్టుముట్టింది. కొద్దిపాటి ఆయుధాలతోనే... జతిన్‌ బృందం రెండు గంటల పాటు పోరాడింది. బ్రిటిష్‌వారి అత్యాధునిక ఆయుధాల ముందు నిలబడలేకపోయింది. తీవ్రంగా గాయపడ్డ జతిన్‌ను బాలాసోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో  చేర్చి చికిత్స చేశారు. మరుసటి రోజు ఆంగ్లేయ మెజిస్ట్రేట్‌ వాంగ్మూలం తీసుకోవటానికి పక్కన కూర్చున్నాడు. శత్రువు తన పక్కన కూర్చోవటాన్ని అవమానంగా భావించిన జతిన్‌ వెంటనే తన శస్త్రచికిత్స కట్లన్నింటినీ తెంపేశాడు. ఆ గాయాల నుంచి నెత్తురు కారుతుంటే... ‘ఇంకా ఈ శరీరంలో మిగిలిన నెత్తురంతటినీ మాతృదేశం కోసం అంకింతం చేసిగాని ఈ జతీంద్రుడు చావడు’ అన్నాడు. అలా తన రక్తంతో భావి స్వేచ్ఛా భారతావనికి దీపం వెలిగించి... 1915 సెప్టెంబరు 10న 35వ ఏట జతిన్‌ కన్నుమూశాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని