Updated : 02 Jul 2022 09:28 IST

Azadi Ka Amrit Mahotsav: గజగజచలిలో.. మంచుగడ్డలపై జయ ప్రకాశం..

యప్రకాశ్‌ నారాయణ్‌ అనగానే చాలామందికి ఇందిరాగాంధీ గుండెల్లో దడ పుట్టించిన సోషలిస్టు నాయకుడే గుర్తుకొస్తారు. స్వాతంత్య్రానికి ముందు కూడా తన పట్టుదలతో ఆంగ్లేయులకూ చుక్కలు చూపించారు జేపీ. బ్రిటిషర్లను వెళ్లగొట్టడానికి గెరిల్లా సైన్యాన్ని తయారు చేశారు. 16 నెలలపాటు బ్రిటిష్‌ సైన్యం చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. చివరికి గాంధీజీ జోక్యంతో బయటపడ్డారు.

బిహార్‌లో గంగానది ఒడ్డునున్న సితాబ్దియారా గ్రామంలో 1902 అక్టోబరు 11న జన్మించిన జేపీ పట్నాలో చదువుకున్నారు. జాతీయోద్యమ నేత బ్రిజ్‌కిశోర్‌ ప్రసాద్‌ కుమార్తె ప్రభావతితో 1920లో పెళ్లయింది. స్వతంత్ర భావాలున్న ప్రభావతి... సబర్మతి ఆశ్రమానికి వెళ్లగా... జేపీ తన చదువులు కొనసాగించారు. ఆమె బ్రహ్మచర్యం పాటించడంతో వీరిద్దరికీ వారసుల్లేరు.

సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంగ్లేయ విద్యను వదిలేయాలని పట్నాలో మౌలానా అబుల్‌కలామ్‌ ఆజాద్‌ ఇచ్చిన పిలుపుతో జేపీ ఉత్తేజితుడయ్యారు. కాంగ్రెస్‌ నిర్వహణలోని బిహార్‌ విద్యాపీఠ్‌లో చేరి కాలేజీ చదువు పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం 1922లో అమెరికా ఓడెక్కారు జేపీ.  సోషియాలజీ పితామహుడిగా పేరొందిన ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ రాస్‌ వద్ద చదువుకున్నారు. అక్కడే ఆయనకు మార్క్సిజం, సోషలిజం భావజాలాలు పరిచయమయ్యాయి. 1929లో కమ్యూనిస్టు భావజాలంతో స్వదేశానికి వచ్చిన జేపీలో స్వాతంత్య్ర కాంక్ష పెరిగిందే తప్ప తగ్గలేదు. భార్య ప్రభావతి మరింత గాంధేయవాదిగా మారారు. ఇద్దరూ కలసి లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి వెళ్లారు. నెహ్రూ ఆహ్వానం మేరకు జేపీ కాంగ్రెస్‌లో చేరి, పార్టీ పరిశోధక విభాగంలో పనిచేయటం ఆరంభించారు. ఉప్పుసత్యాగ్రహంలో కాంగ్రెస్‌ నేతలంతా అరెస్టు కావటంతో ఓ రహస్య కార్యాలయం పెట్టి పనులు నడిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్టు చేశారు. నాసిక్‌ జైలులో రామ్‌ మనోహర్‌ లోహియా, అశోక్‌ మెహతా, అచ్యుత్‌ పట్వర్ధన్‌లాంటి నేతలను కలిసే అవకాశం లభించింది. కాంగ్రెస్‌ను సామ్యవాదంవైపు వేగంగా నడిపించాలని వారు భావించారు. 1934లో జేపీ, స్నేహితులతో కలసి కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని స్థాపించారు. ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా, జేపీ కార్యదర్శిగా కాంగ్రెస్‌లో భాగంగానే ఇదీ పని చేసేది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జేపీని హజారీబాగ్‌ జైలుకు పంపించారు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రణాళికను ఆయన రచించారు. 1942 నవంబరు 9.. దీపావళి రోజున ముహూర్తం పెట్టుకున్నారు. ఊరంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతోంది. సిబ్బంది కూడా తక్కువే ఉన్నారు. రాత్రి పదిగంటల సమయంలో... నలుగురు జేపీ అనుచరులు జైలు వార్డెన్లను సిగరెట్టు, పాన్‌లతో ముచ్చట్లలోకి దించారు. మిగిలినవారు ప్రహరీ వద్దకు చేరుకున్నారు. వీరిలో జోగేందర్‌ శుక్లా (గతంలో భగత్‌సింగ్‌తో కలసి పనిచేశారు)కు చకచకా గోడలు పాకుతూ ఎక్కే నైపుణ్యముంది. నడుముకు ధోవతులను తాడుగా కట్టి 17 అడుగుల ప్రహరీని ఎక్కి బయటివైపునకు దూకాడు... ఆ ధోవతుల తాడుతో మిగిలినవారూ అలవోకగా బయటపడ్డారు. ఉలిక్కిపడిన పోలీసులు జేపీ తలపై రూ.10 వేల రివార్డు ప్రకటించారు. సజీవంగా లేదా చంపైనా తీసుకురావాలని ఆదేశించారు. కానీ అవన్నీ వృథా ప్రయాసే అయ్యాయి. బెనారస్‌కు వెళ్లిన జేపీ నేపాల్‌ చేరుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడే సాయుధ పోరాటంతోనే ఆంగ్లేయులను పారదోలగలమంటూ... ఆజాద్‌ దాస్తా (స్వతంత్ర సేన)ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌లో ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ను కలవటానికి వెళుతుంటే 1943 సెప్టెంబరులో రైల్లో పోలీసులకు  పట్టుబడ్డారు. జేపీని లాహోర్‌ జైలుకు తరలించి, 16 నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. చలికాలంలో మంచుగడ్డలపై కూర్చోబెట్టి... విప్లవ కార్యకలాపాలు, సహచరుల గురించి చెప్పాలని వేధించినా నోరు విప్పలేదు. దీంతో ఆగ్రా జైలుకు పంపించారు.

ఇంతలో కాంగ్రెస్‌తో రాయబారానికి ఇంగ్లాండ్‌ నుంచి కేబినెట్‌ మిషన్‌ వచ్చింది. చర్చలు జరపాలంటే... జేపీని, లోహియాను విడుదల చేయాలంటూ గాంధీజీ షరతు విధించారు. ఫలితంగా 1946లో జైలు నుంచి విడుదలైన జేపీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ‘‘అనేక విషయాల్లో జేపీ నాతో విభేదించొచ్చు. అలాగని ఆయనలోని స్వాతంత్య్ర కాంక్షను చూడకుండా ఉండలేను’’ అని గాంధీజీ పేర్కొన్నారు. దేశ విభజనను అంగీకరించవద్దంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ఎంతగానో బతిమిలాడారు జేపీ. స్వాతంత్య్రానంతరం తన కేబినెట్‌లో చేరాల్సిందిగా జేపీని నెహ్రూ ఆహ్వానించారు. తాను సూచించిన సంస్కరణలకు సానుకూలత రాకపోవటంతో పదవి వద్దనుకున్నారు. జీవితాంతం ప్రజా రాజకీయాన్నే నమ్ముకున్న ఈ గాంధేయ విప్లవవాది 1979 అక్టోబరు 8న కన్నుమూశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని