- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Azadi Ka Amrit Mahotsav: చక్కెర మానేశారు... ఉప్పు ఆపేశారు!
భారత్‌ను శాశ్వతంగా పాలిస్తామనే భ్రమతో... అప్పుడప్పుడే ఎదుగుతున్న జాతీయ కాంగ్రెస్‌ను పురిట్లోనే చంపేయాలన్న తపనతో ... హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బతీయాలన్న కుతంత్రంతో... చేసిన బెంగాల్ విభజన చివరకు ఆంగ్లేయుల పాలిట భస్మాసురహస్తమైంది. భారతీయుల్లో స్వదేశీ భావనను పెంచింది. కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసింది. జాతీయోద్యమానికి ఊపిరులూదింది. అన్నింటికీ మించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదలటానికి బీజం వేసింది.
హిందూ-ముస్లింలు కలసి సాగుతూ, వేళ్లూనుకుంటున్న జాతీయ కాంగ్రెస్‌ను చూసి అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ మదిలో కుత్సిత ఆలోచన మెదిలింది. భారత్‌లో తమ పాలన శాశ్వతంగా కొనసాగాలంటే హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని యోచించాడు. దాదాపు 7కోట్ల మంది జనాభాగల బెంగాల్‌ను విభజించాలని 1903లో నిర్ణయించారు. పాలనా సౌలభ్యం కోసమంటూ వివరణ ఇచ్చారు. కానీ చేసిందంతా... మతపరంగానే! ముస్లింలు అధికంగాగల తూర్పు బెంగాల్‌ను విడగొట్టారు. దీనికి తొలుత ముస్లింల నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 1904లో కర్జన్ ప్రత్యేకంగా వెళ్లి ముస్లిం నేతలను కలసి వారి మనసు మార్చి వచ్చాడు. 1905 జులైలో బెంగాల్ విభజన ప్రకటన చేశాడు.
ఈ ప్రకటనతో ఆశ్చర్యపోయిన బెంగాల్ ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. అప్పటిదాకా కేవలం విజ్ఞాపనలు, రాజ్యాంగబద్ధమైన సంస్కరణలను కోరటానికే పరిమితమైన జాతీయ కాంగ్రెస్ అనివార్యంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాల్సి వచ్చింది. ఆగస్టు 7న కలకత్తా టౌన్‌హాల్‌లో భారీ సమావేశం జరిగింది. ఆంగ్లేయులపై ఆర్థికంగా ఒత్తిడి తెస్తేనే వింటారనే ఉద్దేశంతో... విభజనకు వ్యతిరేకంగా విదేశీ వస్తువులను బహిష్కరించాలంటూ... స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తర్వాతికాలంలో ఇదో మహాగ్నిగా రగులుకుంటుందని... గాంధీజీకి సైతం స్ఫూర్తినిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులకు 7 కోట్ల జనాభాగల బెంగాల్ భారీ మార్కెట్‌గా ఉండేది. ఆ మార్కెట్‌ను దెబ్బతీయాలన్నది విదేశీ వస్తు బహిష్కరణకు ప్రేరణ.
మాంచెస్టర్ దుస్తులను... లివర్‌పూల్ ఉప్పును బహిష్కరించాలంటూ ఇచ్చిన పిలుపునకు బెంగాల్ అనూహ్యంగా స్పందించింది. వందేమాతరం అంటూ ఇంగ్లాండ్ నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల నుంచి... విలాస వస్తువుల దాకా అన్నింటినీ బహిష్కరించారు. ఇంగ్లాండ్ నుంచి దిగుమతైన ఉప్పు కొనటం ఆపేశారు. చక్కెర వాడకం మానేసి... దాని బదులు బెల్లం వినియోగించడం మొదలెట్టారు. విదేశీ దుస్తులనైతే... ఎక్కడ కనబడితే అక్కడ కాల్చేస్తూ. ఆ దుస్తులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ చేసేవారు. మహిళలు విదేశీ గాజులు తీసేశారు. విదేశీ వస్తువులను, వస్త్రాలను వినియోగించే ఇళ్లలో పూజలు, పెళ్లిళ్లు ఇతర కార్యాలను పూజారులు బహిష్కరించారు. ఇలా... గ్రామీణ, పట్టణ తేడా లేకుండా మహిళలు, విద్యార్థులు పాల్గొనటంతో ఉద్యమం రగులుకుంది. వస్తువులతో మొదలైంది కాస్తా... ఆంగ్లేయ కాలనీలను వ్యాపారులు; విద్యాసంస్థలను టీచర్లు; కోర్టులను లాయర్లు బహిష్కరించే దిశగా సాగింది. కోర్టులను బహిష్కరించి... స్వదేశ్ బంధబ్ సమితిలాంటి వాటి ద్వారా వేల కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించారు.
తొలుత బెంగాల్‌కే పరిమితమైన ఈ ఉద్యమాన్ని...తిలక్, లాలాలజపత్‌రాయ్, సయ్యద్ హైదర్, చిదంబరం పిళ్లై, బిపిన్‌చంద్రపాల్‌లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేశారు. దీంతో స్వదేశీ వస్త్ర పరిశ్రమ ఊపందుకుంది. సబ్బులు, అగ్గిపెట్టెలు ఇతరత్రా వస్తువుల్ని దేశీయంగా తయారు చేయటం మొదలైంది. బ్యాంకులు, బీమా కంపెనీలను కూడా భారతీయులే తెరవటానికి బీజం పడింది. వీటన్నింటి ఫలితంగా... బ్రిటన్ అమ్మకాలు 25శాతం పడిపోయాయి. అన్నింటికీమించి... విభజన కారణంగా వ్యాయామశాలలు కేంద్రాలుగా... విప్లవ సంస్థలు పుట్టుకొచ్చాయి. అప్పటిదాకా స్తబ్ధుగా... విజ్ఞాపనలతో సాగుతున్న భారతావని కాస్తా... ఒక్కసారిగా స్వాతంత్య్ర ఉద్యమ రూపం దాల్చటానికి బెంగాల్ విభజన దోహదం చేసింది. చివరకు... 1911లో ఆ విభజనను వెనక్కి తీసుకోవటమేగాకుండా... రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చేసింది ఆంగ్లేయ సర్కారు. అయినా ఉద్యమం మాత్రం ఆగలేదు.
హిందూ ముస్లిం రాఖీ బంధం
బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీ వేడుకను వేదికగా వాడుకున్నారు. విభజన అమలు సమయంలోనే రాఖీ పండగ వచ్చింది. దీంతో... హిందూ-ముస్లింలు పరస్పరం రాఖీలు కట్టుకొని ఆంగ్లేయులకు తమ ఐక్యత చాటాల్సిందిగా... పిలుపునిచ్చారాయన. మతాలకతీతంగా వేలమంది బెంగాల్ వ్యాప్తంగా రాఖీలతో వీధుల్లోకి వచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!