Azadi Ka Amrit Mahotsav: బెల్టులో పిస్తోలుతో బిర్లా...
భారతావనిలో పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటి బిర్లా! తరాలు మారినా చెరగని ఈ పేరుకు వాణిజ్యంతోనే కాదు భారత స్వాతంత్య్ర సమరంతోనూ విడదీయరాని బంధముంది.
భారతావనిలో పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటి బిర్లా! తరాలు మారినా చెరగని ఈ పేరుకు వాణిజ్యంతోనే కాదు భారత స్వాతంత్య్ర సమరంతోనూ విడదీయరాని బంధముంది. ఆంగ్లేయ సామ్రాజ్యంలో వ్యాపారం చేస్తూనే దేశస్వాతంత్య్రం కోసం బహిరంగంగా పోరాడిన చరిత్ర బిర్లా గ్రూపు వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్‌దాస్ బిర్లాది.
1894 ఏప్రిల్ 10న రాజస్థాన్‌లోని పిలానీ గ్రామంలో జన్మించారు ఘన్‌శ్యామ్‌దాస్ బిర్లా! చదవటం, రాయటం, ప్రాథమిక గణితంతోనే 11వ ఏట చదువు ఆగిపోయింది. 16వ ఏటే జౌళి వ్యాపారంలోకి దిగారు. అయితే, సంప్రదాయ మార్వాడీ కుటుంబ వ్యాపారాలను దాటి... వివిధ రంగాల్లో విస్తరించటానికి, పరిశ్రమలవైపు దృష్టిసారించారు. ఈ క్రమంలో ఆయన కలకత్తాకు మారారు. రూ.50 లక్షల పెట్టుబడితో బిర్లా బ్రదర్స్ లిమిటెడ్‌ను, 1919లో కలకత్తాలో జూట్ మిల్లును స్థాపించారు జీడీ. అదే తొలి భారీ భారతీయ జౌళి కంపెనీ. అప్పటికే బెంగాల్‌లో పాతుకుపోయిన యూరోపియన్, బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతీయుడు పోటీకి రావటాన్ని సహించలేకపోయారు. వ్యాపారంలో అనేక అడ్డంకులు సృష్టించారు. వెనక్కి తగ్గలేదు జీడీ. ‘‘ఆంగ్లేయుల జాతి వివక్ష చాలా ఇబ్బంది పెట్టేది. కనీసం వారెక్కే లిఫ్ట్‌లు కూడా నన్ను ఎక్కనిచ్చేవారు కాదు. కలవటానికి వెళితే బెంచిపై కూర్చోమనే వారు కూడా కాదు. ఈ అవమానాలన్నీ నన్ను రాటుదేల్చాయి. రాజకీయాలవైపు నడిపించాయి’’ అని స్వయంగా చెప్పుకొన్నారాయన. అలా... కలకత్తాలో తెల్లవారి ముందున్న బెంచిపై కూడా కూర్చోవటానికి అవకాశంలేని ఘన్‌శ్యామ్‌దాస్ బిర్లా... లండన్‌లోని ఇంగ్లాండ్ ప్రధాని అధికార నివాసంలో అతిథ్యం స్వీకరించే దశకు ఎదిగారు.
యుక్తవయసులో జీడీ బిర్లాపై బెంగాల్ రాజకీయ వాతావరణ ప్రభావం పడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆయుధాల దోపిడీ కేసులో జీడీని కూడా ఆంగ్లేయులు బలంగా అనుమానించారు. బ్రిటిష్ కంపెనీ నుంచి పట్టపగలు కొట్టేసిన ఆయుధాలను అనుశీలన్ సమితి విప్లవకారులు తొలుత జీడీ ఇంట్లోనే దాచి... అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారనే ఆరోపణలున్నాయి. జీడీ ఆ సమయంలో మూడునెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపై ఆరోపణలకు సాక్ష్యాలు దొరక్కపోవటంతో ఆంగ్లేయులూ ఏమీ చేయలేకపోయారు. అలా... విప్లవ వాదంతో మొదలైన ఆయన అటు వ్యాపారంతో పాటు ఇటు రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించటానికి వెనకాడకపోవటం విశేషం. 1925లో ఎంపైర్ అనే పత్రికను కొని... న్యూ ఎంపైర్ పేరుతో నడిపించారు.
1926లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గాంధీజీతో పరిచయం ఆయన్ను మార్చేసింది. రాజకీయ నాయకుడిగాకంటే కూడా... గాంధీజీ సత్యాన్వేషణ బిర్లాను ఆయనకు దగ్గర చేసింది. గాంధీజీ ఆయనకు చాలా లేఖలు రాశారు. ‘‘చాలా సందర్భాల్లో అర్థం కాకున్నా, ఆయన (గాంధీ)దే సరైన పంథానేమో అనిపించేది’’ అనేవారు జీడీ. అందుకే చివరి దాకా గాంధీకి స్నేహితుడిగా, బంటుగా ఉన్నారు. ఆయన బాటలో అంటరానితనాన్ని నిరసించారు. గాంధీజీ సారథ్యంలో 1932లో ఏర్పాటైన హరిజన్ సేవక్ సంఘ్‌కు అధ్యక్షుడిగా బిర్లా వ్యవహరించారు. దళితుల కోసం పాఠశాలలు, హాస్టళ్లు కట్టించారు. ఖాదీ, గ్రామీణాభివృద్ధి, విద్యలాంటి మహాత్ముడి ప్రణాళికకు చేయూతనిచ్చారు. ఇటు జాతీయోద్యమంతో పాటు... అటు పారిశ్రామికంగానూ పేపర్‌మిల్లు, ఆటోమొబైల్, తేయాకు, వస్త్ర పరిశ్రమ రంగాల్లోకీ విస్తరించారు. ఆంగ్లేయుల అధీనంలోని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు పోటీగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ)ని ఆరంభించారు. ఫిక్కీ నేరుగా జాతీయోద్యమానికి మద్దతు ప్రకటించటం విశేషం. లండన్‌లో మొదటి, రెండు రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరైన ఆయన గాంధీకి, ఆంగ్లేయులకు మధ్య వారధిలా వ్యవహరించారు. కాంగ్రెస్‌తో ఆయన సంబంధాలపై ఆంగ్లేయ సర్కారులో ఆగ్రహం పెరిగింది. భారత వైస్రాయ్ లిన్‌లిత్‌గో బిర్లాకు అపాయింట్‌మెంట్ ఇవ్వటానికి నిరాకరించాడు. నన్ను అవమానించిన వ్యక్తిని కలవటం నాక్కూడా ఇష్టం లేదు’’ అంటూ బిర్లా కుండబద్దలు కొట్టేశారు. స్వాతంత్య్రానంతరం భారత్‌లో అభివృద్ధి ఎలా ఉండాలో వివరిస్తూ... టాటాతో కలసి 15 ఏళ్ల ప్రణాళికను సమర్పించారు కూడా.
గాంధీజీ చివరి క్షణాల దాకా బిర్లాతో ముడిపడి ఉన్నారు. దిల్లీలోని బిర్లా హౌ]స్‌లోనే ఉండేవారు. అక్కడే కన్నుమూశారు. దేశ విభజన నేపథ్యంలో గాంధీజీపై దాడికి అవకాశం ఉందని బిర్లా స్వయంగా చాలాసార్లు రహస్యంగా ఆయన రక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ‘‘నా బెల్టులో పిస్తోలు పెట్టుకొని ఆయన ప్రార్థనలకు హాజరయ్యేవాడిని. ఎవరైనా ఆయన దగ్గరకు వెళుతున్నారంటే చాలు... వారిని అనుమానాస్పదంగా చూసేవాడిని. కానీ చివరకు అవన్నీ వృథా అయ్యాయి. ఎంతమంది అభిమానులు, స్నేహితులమున్నా మహాత్ముడిని కాపాడుకోలేకపోయాం’’ అంటూ ఆవేదన చెందారు బిర్లా. స్వాతంత్య్రానంతరం వ్యాపార విస్తరణతో పాటు బిట్స్‌పిలానీలాంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థను స్థాపించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకు అండగా నిలిచిన ఈ అసమాన ‘భారతీయుడు’ 1983 జూన్ 11న కన్నుమూశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్