Azadi Ka Amrit Mahotsav: తెరవెనక... అమెరికా!

భారత స్వాతంత్య్ర సాధన కోసం చేసిన పోరాటానికి అనేక దేశాల సానుభూతి లభించింది. ముఖ్యంగా... జపాన్‌, జర్మనీ, ఇటలీ, సోవియట్‌ యూనియన్‌, అమెరికాల నుంచి! కానీ... బ్రిటిష్‌వారు భారత్‌ను త్వరగా వీడి వెళ్లటంలో

Updated : 03 Aug 2022 06:14 IST

భారత స్వాతంత్య్ర సాధన కోసం చేసిన పోరాటానికి అనేక దేశాల సానుభూతి లభించింది. ముఖ్యంగా... జపాన్‌, జర్మనీ, ఇటలీ, సోవియట్‌ యూనియన్‌, అమెరికాల నుంచి! కానీ... బ్రిటిష్‌వారు భారత్‌ను త్వరగా వీడి వెళ్లటంలో ఓ విదేశీ హస్తం బలంగా పనిచేసింది. ఆ అదృశ్య హస్తం... అమెరికా!

బ్రిటిష్‌వారి నుంచే స్వాతంత్య్రం సంపాదించుకున్న అమెరికన్లకు భారత పోరాటం కూడా ఆప్తమవటం సహజ పరిణామం. 1900 ఆరంభంలోనే పనిచేయటానికి, చదువుకోవటానికి అనేక మంది భారతీయులు అమెరికా వెళ్లారు. భారతీయుల స్వయం పాలనకు మద్దతుగా వారు ఇండో అమెరికన్‌ నేషనల్‌ ఫోరం ఏర్పాటు చేశారు. వీరికి తోడు స్వామి వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, లాలా లాజ్‌పత్‌ రాయ్‌లాంటి ప్రముఖుల అమెరికా పర్యటనలు, ప్రసంగాలు కూడా భారత్‌పై ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. విప్లవపార్టీ గదర్‌ అక్కడే పురుడుపోసుకుంది. అలా అమెరికా... భారత స్వాతంత్య్ర పోరాటానికి వేదికలా నిలిచింది.

గాంధీజీ చేపట్టిన అహింస, సత్యాగ్రహాలు అమెరికన్‌ మీడియాకు ఆసక్తికర వార్తలయ్యాయి. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం నాటికి మన స్వరాజ్య పోరాటం అమెరికా పత్రికల మొదటి పేజీలకెక్కింది. రెండో ప్రపంచయుద్ధానంతరం వలసపాలనపై అమెరికా ప్రజల్లోనూ, ప్రభుత్వంలోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. 1941లో ప్రవాస భారతీయుల ఇండియా లీగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన జగ్‌జీత్‌సింగ్‌ అమెరికా రచయితలు, మానవ హక్కులు, అమెరికా చట్టసభల సభ్యులకు భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను బలంగా వినిపించారు. భారత్‌లో బ్రిటిష్‌వారి అరాచకాలను, బెంగాల్‌ కరవు సృష్టించిన దారుణాలను వివరించారు. ఇది భారతీయులపై ఉన్న వీసా పరిమితులను సడలించడంతోపాటు భారత జాతీయోద్యమానికి అమెరికాలో మద్దతు పెరగటానికి దోహదం చేసింది.

రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యేనాటికి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌, ఉపాధ్యక్షుడు హెన్రీ వాలెస్‌, విదేశాంగ మంత్రి కార్డెల్‌ లాంటివారంతా భారత్‌కు మద్దతుగా మాట్లాడసాగారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కలసి... బెంగాల్‌లో కరవు బాధితులను ఆదుకోవటానికి బిల్లు ఆమోదించారు. భారత్‌కు స్వయంపాలన గురించి రూజ్‌వెల్ట్‌ అప్పటి  బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌తో ప్రస్తావించారు. పదేపదే రూజ్‌వెల్ట్‌ భారత్‌ గురించి ప్రస్తావించటం చర్చిల్‌కు నచ్చలేదు. ఇద్దరి మధ్యా కొద్దిరోజులు మాటలు కూడా ఆగిపోయాయి. స్పందన లేకపోవటంతో రూజ్‌వెల్ట్‌ తనకు నమ్మకస్తుడైన కర్నల్‌ లూయిస్‌ జాన్సన్‌ను 1942లో భారత్‌కు పంపించారు. స్వాతంత్య్రం ఇప్పిస్తే... యుద్ధంలో సాయానికి సిద్ధమంటూ కాంగ్రెస్‌ నేతలు లూయిస్‌కు స్పష్టం చేశారు. లూయిస్‌ భారత్‌కు రావటం బ్రిటిష్‌వారికి రుచించలేదు. చివరికి రూజ్‌వెల్ట్‌ను సంతృప్తిపరచడానికి తన కేబినెట్‌ సహచరుడు క్రిప్స్‌ను అయిష్టంగానే భారత్‌లో రాయబారానికి పంపించాడు చర్చిల్‌! దాన్ని తెరవెనక నుంచి విఫలం చేసిందీ చర్చిలే!


ఆ ఒప్పందం దారిచూపింది...

అమెరికా ప్రతినిధి లూయిస్‌ రాక భారతీయుల్లో ఆశలు రేపితే... ఆంగ్లేయుల్లో అసంతృప్తిని, ఆందోళనను రేకెత్తించింది. తన మిత్రదేశం బ్రిటన్‌ ఏమనుకున్నా... భారత స్వాతంత్య్రం, వలసపాలన విషయంలో రూజ్‌వెల్ట్‌ మనసు మార్చుకోలేదు. 1941లో రూజ్‌వెల్ట్‌-చర్చిల్‌ అట్లాంటిక్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో దేశాల స్వయంప్రతిపత్తి నిబంధన చేర్చేలా రూజ్‌వెల్ట్‌ ఒత్తిడి తెచ్చారు. అయిష్టంగానే చర్చిల్‌ అంగీకరించాడు. ‘యుద్ధానంతరం దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలో, ఏ ప్రభుత్వ పాలన కింద జీవించాలో నిర్ణయించుకునే హక్కు ఆయా దేశాల ప్రజలకే ఉంటుంది. బలవంతంగా లాక్కున్న సార్వభౌమ హక్కులను పొందే, కోరుకునే, పునరుద్ధరించుకునే హక్కూ ఉంటుంది’ అనేది ఆ ఒప్పందంలోని నిబంధన. అమెరికా ఈ నిబంధననే చూపించి భారత్‌కు స్వాతంత్య్రం గురించి నిలదీసింది. దీంతో, గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చర్చిల్‌... మాట మార్చాడు. ఈ నిబంధన ఐరోపా దేశాలకే వర్తిస్తుందంటూ బొంకాడు. ‘‘భారత్‌కు తక్షణమే స్వయంప్రతిపత్తి ఇవ్వాలి. ఆ తర్వాత కొన్నాళ్లకు.. తాను బ్రిటిష్‌ రాచరికం కింద ఉండాలో.. స్వతంత్ర దేశం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికివ్వాలి’’ అని రూజ్‌వెల్ట్‌ స్పష్టం చేశారు. మిత్రదేశమైన అమెరికా ఒత్తిళ్లకు తోడు యుద్ధానంతరం బ్రిటన్‌లో చర్చిల్‌ ఓటమి, బ్రిటన్‌ ఆర్థిక దుస్థితి కలసి భారత్‌లో వలసపాలన ముగింపునకు దారితీశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని