Updated : 09 Aug 2022 07:55 IST

Azadi Ka Amrit Mahotsav: ఐరాసకు వెళితే ఆలస్యమవుతుందని...

ఆధునిక ప్రపంచ చరిత్రలో... కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసి... వలసబాట పట్టించి... లక్షల మంది ధన, మాన ప్రాణాలను హరించిన అత్యంత దారుణమైన ఘట్టం... భారతావని విభజన! ఆంగ్లేయులు వెళుతూ వెళుతూ... భారత్‌ను ఎలా విడగొట్టారు? వెళ్లాక ఏమనుకున్నారు?

దేశాన్ని విభజించడానికి 1947 మార్చి 8వ తేదీ వరకు కాంగ్రెస్‌ అంగీకరించలేదు. కానీ అప్పటికే బ్రిటిష్‌ వాళ్లు భారతదేశాన్ని వీడి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దేశ వ్యాప్తంగా భారీస్థాయిలో అల్లర్లు, మతకల్లోలాలు చెలరేగాయి. బలమైన కేంద్రంతో కూడిన దేశం కావాలంటే... విభజన అనివార్యమని గుర్తించిన జాతీయ కాంగ్రెస్‌ పాకిస్థాన్‌ ఏర్పాటుకు సరేనంది. దీంతో 1947 జూన్‌ 3న వైస్రాయ్‌ మౌంట్‌బాటెన్‌ విభజన ప్రణాళిక ప్రకటించాడు. అంతేగాకుండా ఆగస్టు 15నే తాము భారత్‌ను విడిచి, వెళ్లిపోతున్నట్లు వెల్లడించాడు. ఆలోపే విభజన జరగాలని నెహ్రూ, జిన్నా స్పష్టంచేశారు. ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. స్వాతంత్య్రం ఇచ్చి ఆంగ్లేయులు వెళ్లిపోయాక విభజనకు కాంగ్రెస్‌ అడ్డుపుల్లలు వేస్తుందని, తన మాట చెల్లుబాటు కానివ్వదనే భయం జిన్నాదైతే... స్వాతంత్య్రానంతరం ఘర్షణలు కొనసాగినా, ముస్లింలీగ్‌తో చర్చలకు అధిక సమయం వెచ్చించాల్సి వచ్చినా పాలన అస్తవ్యస్తం అవుతుందనే ఆందోళన నెహ్రూది! అందుకే ఆ విభజనేదో ముందే జరిగిపోవాలని ఇద్దరూ గట్టిగా కోరుకున్నారు.

వెనక్కి తిరిగి చూడకుండా...

దేశంలోని వివాదాస్పద ప్రాంతాలు (పంజాబ్‌, బెంగాల్‌) తెలిసినా... వాటిని సామరస్యంగా, నిష్పాక్షికంగా విభజించేదెవరనే ప్రశ్న తలెత్తింది. మౌంట్‌బాటెన్‌పై నమ్మకంలేని జిన్నా తొలుత ఐక్యరాజ్య సమితికి ఆ బాధ్యత అప్పగించాలని కోరుకున్నాడు. ఐరాస విధివిధానాలు సుదీర్ఘంగా సాగే ప్రక్రియ అని... గుర్తించి వెనక్కి తగ్గాడు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో భారత వ్యవహారాల మంత్రి లార్డ్‌ లిస్టోవెల్‌... సరిహద్దు కమిషన్‌ ఛైర్మన్‌గా రాడ్‌క్లిఫ్‌ పేరును సూచించాడు. అప్పటికాయన లండన్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి మౌంట్‌బాటెన్‌ కంటే ముందు వైస్రాయ్‌గా వ్యవహరించిన వేవెల్‌ దేశ విభజన జరిగితే సరిహద్దులెలా ఉండాలో ముందే గీతలు గీశాడని అంటారు. అయితే... ఇరుపక్షాలనూ భాగస్వాములను చేస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో చేశామని చెప్పడానికి సరిహద్దు కమిషన్‌ ప్రక్రియ చేపట్టారు. అప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా భారతదేశంలో అడుగుపెట్టని రాడ్‌క్లిఫ్‌... నిష్పాక్షికంగా ఉంటారన్న ఉద్దేశంతో ఆయన్ని ఈ పనికి ఎంచుకున్నారు. 1947 జులై 8న రాడ్‌క్లిఫ్‌ భారత్‌లో అడుగుపెట్టారు. దిల్లీలో దిగిన ఆయన 10న వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ను కలిశారు. 1936 బ్యాచ్‌ ఐసీఎస్‌ అధికారి క్రిస్టఫర్‌ బూమాంట్‌ను రాడ్‌క్లిఫ్‌ కమిషన్‌ కార్యదర్శిగా, 1927 బ్యాచ్‌ ఐసీఎస్‌ కేవీకే సుందరాన్ని కమిషన్‌ ఓఎస్డీగా నియమించారు. సుందరం అప్పటికే వైస్రాయ్‌కి ఓఎస్డీగా పని చేస్తున్నారు. వైస్రాయ్‌ కార్యాలయంలోనే పనిచేసే మరో అధికారి వీడీ అయ్యర్‌ను అసిస్టెంట్‌ సెక్రటరీగా వేశారు. రాడ్‌క్లిఫ్‌ సహా వీరంతా రెండు సరిహద్దు కమిషన్లలోనూ పనిచేశారు. వీరికి సహకరించేందుకు కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ల తరఫున నలుగురు (పంజాబ్‌, బెంగాల్‌లకు ఇద్దరేసి చొప్పున న్యాయమూర్తులు) ప్రతినిధులు నియమితులయ్యారు. ఈ మొత్తం విభజన ప్రక్రియ నిర్వర్తించడానికి రాడ్‌క్లిఫ్‌కు ఇచ్చిన సమయం నెల రోజులు మాత్రమే! ఈ నాలుగువారాల సమయంలోనే తనకు అప్పగించిన పని పూర్తి చేసి... పేపర్‌పై పెన్నుతో గీతలు గీసి భారత్‌-పాకిస్థాన్‌ల సరిహద్దులు నిర్ణయించిన ఆయన స్వాతంత్య్ర ఉత్సవాల్లోనూ పాల్గొనలేదు. తలతిప్పి వెనక్కి చూడకుండా ఆగస్టు 14న లండన్‌ విమానమెక్కారు. అంతేకాదు, తనకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇవ్వజూపిన 3వేల పౌండ్ల ఫీజునూ నిరాకరించారు. మళ్లీ ఎన్నడూ భారత్‌, పాకిస్థాన్‌లలో అడుగు పెట్టలేదు కూడా.

అసంతృప్తిగానే ఉండేది...

ఆధునిక మానవాళి చరిత్రలో అత్యంత దారుణమైన విభజన రేఖ గీసిన రాడ్‌క్లిఫ్‌... తాను చేసిన పనిపై ఏమనుకున్నాడు? సంతృప్తి చెందాడా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వచ్చింది. 1976లో ప్రముఖ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని రాడ్‌క్లిఫ్‌ స్వయంగా అంగీకరించాడు. ‘‘నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. నాలుగైదు వారాల్లో అంత బాగా చేయలేకపోయా. కనీసం రెండు మూడేళ్ల సమయం ఇచ్చి ఉంటే... మరింత మెరుగ్గా ఉండేదేమో’’ అని రాడ్‌క్లిఫ్‌ వివరించాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని