Lok Sabha: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

ఏడుసార్లు ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్‌ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.

Published : 20 Jun 2024 21:06 IST

దిల్లీ: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఒడిశాలోని కటక్‌ నుంచి ఏడుసార్లు విజయం సాధించిన భర్తృహరి..  స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని.. ఆయనకు కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే)తో పాటు రాధామోహన్‌ సింగ్‌ (భాజపా), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (భాజపా), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

భర్తృహరి మహతాబ్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్‌ని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. కటక్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసి ఏడోసారి విజయ దుందుభి మోగించారు. మరోవైపు, 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.  జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్‌ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని