vaccine: B.1.617.2 రకంపై.. ఫైజర్‌ 88శాతం, కొవిషీల్డ్‌ 60శాతం!

భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు భావిస్తోన్న B.1.617.2 రకం వైరస్‌పై వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 24 May 2021 01:57 IST

టీకాల సమర్థతపై పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (PHE) తాజా నివేదిక

లండన్‌: కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా వైరస్‌లను వ్యాక్సిన్‌లు ఏ మేరకు ఎదుర్కొంటున్నాయే విషయంపై అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు భావిస్తోన్న B.1.617.2 రకం వైరస్‌పై వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. లండన్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు B.1.617.2 వేరియంట్‌ను అత్యంత సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తేలింది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న అనంతరం B.1.617.2 వేరియంట్‌ను ఎదుర్కోవడంలో 88శాతం సమర్థత చూపించినట్లు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) వెల్లడించింది. ఇక ఇదే వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా మాత్రం 60శాతం సమర్థత కనబరచినట్లు పేర్కొంది. ఆసుపత్రుల చేరికల నుంచి తప్పించడమే కాకుండా కొవిడ్‌ మరణాలను నియంత్రించడంలో వ్యాక్సిన్‌లు అత్యంత సమర్థత కలిగి ఉన్నాయని PHE ఇమ్యూనైజేషన్‌ విభాగాధిపతి మేరీ రామ్సే పేర్కొన్నారు. ఇప్పటికే బయటపడిన కరోనా రకాలతో పాటు కొత్తగా వెలుగుచూస్తోన్న వాటినుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్‌లు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కొత్త రకాలపై వ్యాక్సిన్‌ల పనితీరుపై ఏప్రిల్‌ 5 నుంచి మే 16 మధ్య పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (PHE) జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత B.1.617.2 నుంచి 88శాతం రక్షణ కల్పిస్తోంది. అదే B.1.1.7 రకంపై మాత్రం 93శాతంగా ఉంది.

* ఆస్ట్రాజెనెకా రెండు డోసులు తీసుకున్న అనంతరం B.1.617.2పై 60శాతం సమర్థత చూపిస్తుండగా.. B.1.1.7పై 66శాతం సమర్థత కలిగి ఉంది.

* తొలి డోసు తీసుకున్న 3 వారాల తర్వాత ఈ రెండు వ్యాక్సిన్‌లు B.1.617.2 రకంపై 33శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

మూడో డోసు అవసరమే..: మోడెర్నా సీఈవో

కరోనా వైరస్‌లో మ్యుటేషన్ల కారణంగా వెలుగు చూస్తోన్న కొత్త రకాలను నుంచి రక్షణ పొందేందుకు బూస్టర్‌ డోస్‌ అవసరమేనని మోడెర్నా సీఈవో స్టీఫేన్‌ బాన్సెల్‌ అభిప్రాయపడ్డారు. మా వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే కొత్తరకాలను ఎదుర్కొనేందుకు మూడో డోసు అవసరమని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం కొత్తగా వెలుగు చూసిన వివిధ రకాల కరోనా వైరస్‌పై బూస్టర్‌ డోసు పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 9కోట్ల మంది మోడెర్నా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సంస్థ సీఈవో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని