Ramdev Baba: మహిళల వస్త్రధారణపై రామ్‌దేవ్‌ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా(Ramdev Baba) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుస్తులు ధరించకపోయినా మహిళలు బాగుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి.

Published : 25 Nov 2022 22:46 IST

ఠానే: మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా(Ramdev Baba) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్‌, ముంబయి మహిళా పతంజలి యోగా సమతి సంయుక్తంగా నిర్వహించిన యోగా సైన్స్‌ క్యాంపు, మహిళలతో ప్రత్యేక సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఠానేలోని హాయ్‌లాండ్‌ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతా ఫడణవీస్‌, సీఎం ఏక్‌నాథ్‌ శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ శిందే సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, మహిళలకు ఏర్పాటు చేసిన యోగా శిక్షణా కార్యక్రమం ముగిసిన వెంటనే వారికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో మహిళలు వివిధ రకాల వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. తాము తెచ్చుకున్న చీరలు ధరించేందుకు కూడా సమయం చాలకపోవడంతో వివిధ డ్రెస్సుల్లో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్‌ బాబా మాట్లాడుతూ ‘‘మహిళలు చీరల్లో బాగుంటారు. సల్వార్‌ సూట్స్‌లోనూ బాగుంటారు. నా కంటికైతే వారేం ధరించకపోయినా అందంగానే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సచిన్‌ సావంత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రామ్‌దేవ్‌ బాబా తన అసలు మనస్తత్వం బయటపెట్టారంటూ విమర్శించారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వారిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని