Musharraf: ముషారఫ్‌పై థరూర్‌ ట్వీట్‌.. భాజపా తీవ్ర అభ్యంతరం!

ముషారఫ్‌ (Musharraf)ను శాంతికోసం ప్రయత్నించిన వ్యక్తిగా శశి థరూర్‌ (Shashi Tharoor)ను అభివర్ణించడాన్ని భాజపా తప్పుబట్టింది.

Published : 06 Feb 2023 11:54 IST

దిల్లీ: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్ ముషారఫ్‌ (Pervez Musharraf) మరణంపై కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ (Shashi Tharoor)  చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా ముషారఫ్‌ (Pervez Musharraf)ను అభివర్ణించడంపై అధికార భాజపా నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశ సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. దీనికి థరూర్‌ (Shashi Tharoor) తిరిగి కౌంటర్‌ ఇవ్వడంతో వివాదం పెద్దదైపోయింది.

భారత్‌తో కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్‌ (Pervez Musharraf). అరుదైన రుగ్మతతో బాధపడుతున్న ఆయన దుబాయిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఆయన మరణంపై శశి థరూర్‌ (Shashi Tharoor) ట్వీట్‌ చేశారు. ‘‘ఒకప్పుడు భారతదేశానికి శత్రువు. ఆయనే 2002-2007 మధ్య శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ఏటా ఐరాసలో కలిసేవాణ్ని. వ్యూహాత్మక ఆలోచనలతో తెలివిగా, ఆకర్షణీయంగా, స్పష్టంగా కనిపించేవారు’’ అంటూ ముషారఫ్‌ (Pervez Musharraf) మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ థరూర్‌ (Shashi Tharoor) ట్వీట్‌ చేశారు.

దీనిపై అధికార భాజపా తీవ్రస్థాయిలో మండిపడింది. థరూర్‌ (Shashi Tharoor) ట్వీట్‌ కాంగ్రెస్‌ వైఖరిని ప్రతిబింబిస్తోందంటూ కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. ‘‘మన దేశంలోకి ఉగ్రవాదాన్ని చొప్పించి.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన సైనికులను హింసించిన వ్యక్తిలో మీరు శాంతిని వెతుకుతున్నారా?’’ అని ప్రశ్నించారు.

దీనికి థరూర్‌ (Shashi Tharoor) బదులిస్తూ.. చనిపోయిన వ్యక్తి గురించి మంచి మాటలు మాట్లాడే భారత్‌లో తాను పెరిగానన్నారు. ‘‘ముషారఫ్‌ (Pervez Musharraf) భారత్‌కు శత్రువే. కార్గిల్‌ యుద్ధానికి బాధ్యుడే. కానీ, 2002-2007 మధ్య తన స్వప్రయోజనాల కోసం భారత్‌తో శాంతిని బలంగా కోరుకున్నారు. భారత్‌కు మిత్రుడు కాకపోయినప్పటికీ.. మనలాగే శాంతిలోనే ఆయన తన వ్యూహాత్మక ప్రయోజనాలను వెతుక్కున్నారు’’ అని థరూర్‌ (Shashi Tharoor) ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని