Uttarakhand Rain: ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్రపై ప్రభావం!

నేటినుంచి రానున్న రెండు మూడు రోజులు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన చమోలీ జిల్లా యంత్రాంగం.. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. వాతావరణశాఖ...

Published : 17 Oct 2021 16:35 IST

దేహ్రాదూన్‌: నేటినుంచి రానున్న రెండు మూడు రోజులు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన చమోలీ జిల్లా యంత్రాంగం.. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులంతా జోషిమఠ్‌, పాండుకేశ్వర్ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ డిస్టిక్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు ఖురానా విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఆదేశాలు జారీ చేశారు. పౌరులు ఈ రెండు రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగాలో పడటంతో పెద్దసంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు.

కేరళలో ముమ్మరంగా వరద సహాయక చర్యలు..

మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకల కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ రోజూ భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. సీఎం పినరయి విజయన్‌ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని