Election Commission: ఒక అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ.. మరోసారి తెరపైకి ఈసీ ప్రతిపాదన!

ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడాన్ని నిరోధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం(EC) తాజాగా మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. లేనిపక్షంలో.. అభ్యర్థులకు...

Updated : 17 Jun 2022 22:23 IST

దిల్లీ: ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడాన్ని నిరోధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం(EC) తాజాగా మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. లేనిపక్షంలో.. అభ్యర్థులకు భారీ జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అభ్యర్థులు రెండు చోట్ల గెలిస్తే.. ఒకచోట ఉప ఎన్నికలు నిర్వహించాల్సి రావడం.. దీంతో ఖజానాపై భారం, మానవ వనరుల వృథా వంటి సమస్యలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల న్యాయశాఖలోని శాసన కార్యదర్శి(లెజిస్లెటివ్‌ సెక్రెటరీ)తో జరిపిన చర్చలో లేవనెత్తినట్లు సమాచారం. 2004లో మొదటిసారిగా ప్రతిపాదించిన ఈ సంస్కరణలను ఆయన మరోసారి తెరపైకి తీసుకొచ్చారు!

ఎన్నికల సంఘానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంలోని శాసన విభాగం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత ఎన్నికల చట్టం ప్రకారం.. సాధారణ, ఉప, ద్వైవార్షిక ఎన్నికల సమయంలో కేవలం రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థికి అనుమతి ఉంది. రెండింటిలో గెలిస్తే.. ఒకదాన్ని వదులుకోవాల్సిందే. ఈ మేరకు 1996లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. అంతకు ముందు.. పోటీ చేసే స్థానాల విషయంలో పరిమితులు లేవు. ఈ క్రమంలోనే 2004లో పోల్ ప్యానెల్.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని సెక్షన్‌లకు సవరణలను ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకుండా నిరోధించాలని సూచించింది.

‘ఒకవేళ ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగించాలంటే.. రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థి.. రెండింట గెలిచినప్పుడు. ఖాళీ చేసిన స్థానానికి ఉప ఎన్నిక ఖర్చును భరించాలి’ అని 2004 నాటి ప్రతిపాదనను ఉటంకిస్తూ సదరు అధికారి చెప్పారు. అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికలకు రూ.5 లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ.10 లక్షలు జరిమానాగా అప్పట్లో ప్రతిపాదించారు. అయితే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మార్చాలని పోల్‌ ప్యానెల్‌ భావిస్తోంది. ‘ఉప ఎన్నికల నిర్వహణ క్రమంలో ప్రభుత్వ ఖజానాతోపాటు సిబ్బంది, వనరుల వినియోగంపై అదనపు భారం పడుతోంది. పైగా, గెలిచిన అభ్యర్థి ఖాళీ చేయడంతో.. సదరు నియోజకవర్గం ఓటర్లకు అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్కరణలు అవసరం’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని