Akasa Air: క్యాబిన్‌లో కాలిన వాసన.. ఆకాశ ఎయిర్‌ విమానం వెనక్కి

దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు చెందిన ఓ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.

Published : 15 Oct 2022 17:42 IST

ముంబయి: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి బెంగళూరు వెళ్తోన్న ఓ విమానం క్యాబిన్‌లో కాలిన వాసన రావడంతో అప్రమత్తమైన పైలట్లు వెనక్కి మళ్లింది. పక్షిని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు.

ఈ విమానం ముంబయి నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే క్యాబిన్‌లో కాలిన వాసన వచ్చింది. విమాన వేగం పెరిగే కొద్దీ ఈ వాసన ఎక్కువవడంతో అప్రమత్తమైన పైలట్లు.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ప్రయాణికులను దించేశారు. ఆ తర్వాత తనిఖీలు చేపట్టగా ఒకటో నంబరు ఇంజిన్‌ వద్ద పక్షిని గుర్తించారు. విమానాన్ని పక్షి ఢీకొట్టడం వల్లే కాలిన వాసన వచ్చినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అది మినహా విమాన ఇంజిన్లలో ఎలాంటి లోపం కన్పించలేదన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

ఘటనను ఆకాశ ఎయిర్‌ కూడా ధ్రువీకరించింది. అయితే ఘటన సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్నది మాత్రం తెలియరాలేదు. విమానం ముంబయిలో ల్యాండ్‌ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో పంపించినట్లు ఆకాశ ఎయిర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఆకాశ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని