Bangladesh MP murder: దిండుతో ఊపిరాడకుండా చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక వివరాలు

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ అనార్‌ హత్య కేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. నేపాల్‌లో అరెస్ట్‌ అయిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మరికొంత పురోగతి కనిపించింది.

Published : 13 Jun 2024 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యక్తిగత పర్యటన నిమిత్తం కోల్‌కతాకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ అనార్‌ హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అతని ముఖానికి దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. ఇటీవల నేపాల్లో అరెస్ట్‌ అయిన మహమ్మద్‌ సియామ్‌ హుస్సేన్‌ పోలీసులకు పలు వివరాలు వెల్లడించాడు.

హత్య అనంతరం అనార్‌కు చెందిన కొన్ని శరీరభాగాలను చిన్న చిన్న ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి న్యూటౌన్‌, బాగ్‌జోలా ప్రాంతంలోని కాల్వల్లో పారేశారు. మరికొన్ని భాగాలను ఓ సూట్‌ కేసులో ఉంచి దానిని బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని బంగాన్‌ అనే ప్రాంతంలో వదిలేసి వచ్చారు. ఈ హత్యకు కుట్రదారుడిగా భావిస్తున్న అక్తరుజమాన్‌ స్నేహితురాలు కూడా తనతోపాటు అనార్‌ను హత్య చేసిందని హుస్సేన్‌ పోలీసులకు వెల్లడించాడు. 

వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ ఎంపీ హత్యకు గురికావడాన్ని పశ్చిమబెంగాల్‌ సీఐడీ సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురుని ఢాకా నుంచి అదుపులోకి తీసుకొంది. ఈనెల 9వ తేదీన నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ నది ఒడ్డున మనిషి ఎముకలను సేకరించింది. దీంతోపాటు అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి కొన్ని కిలోల మానవ మాంసాన్ని వెలికితీసింది. ఆ మాంసం మనిషిదిగా తేలడంతో డీఎన్‌ఏ పరీక్షలకు పంపనున్నారు.

గతనెల 12న చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన బంగ్లా ఎంపీ అన్వర్‌.. గోపాల్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం చికిత్స నిమిత్తం వైద్యశాలకని బయలుదేరి వెళ్లాడు. అతడు తిరిగి రాకపోవడంతో 18న బిస్వాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో ఉండే అక్తరుజమాన్‌ అద్దెకు తీసుకున్న కోల్‌కతా టౌన్‌హాల్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన అన్వర్‌.. తిరిగి వెనక్కిరాలేదు.  ఈ క్రమంలో పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకోగా.. అక్కడ వారికి రక్తపు మరకలు కనిపించాయి. ఫోరెన్సిక్‌ బృందాల సాయంతో మరిన్ని ఆధారాలు సేకరించారు. ఆ మహిళ.. అక్తరు జమాన్‌కు తెలిసిన వ్యక్తేనని, ఆమె సాయంతోనే వలపు వల విసిరి పక్కా పథకం ప్రకారం ఎంపీని స్నేహితుడే దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని