Supreme Court: హరిత టపాసుల తయారీ విధానంపై సుప్రీం ఆగ్రహం

హరిత టపాసుల తయారీలో నిషేధిత రసాయనాలు వినియోగించటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరిత టపాసుల తయారీ ముసుగులో నిషేధిత పటాసులు తయారు చేస్తున్నారని మండిపడింది.....

Published : 06 Oct 2021 23:38 IST

దిల్లీ: హరిత టపాసుల తయారీలో నిషేధిత రసాయనాలు వినియోగించటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరిత టపాసుల తయారీ ముసుగులో నిషేధిత పటాసులు తయారు చేస్తున్నారని మండిపడింది. బాణాసంచా తయారీదారుల తీరును ధర్మాసనం తప్పుబట్టింది. టపాసుల తయారీలో నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది.

పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే టపాసుల్ని నిషేధించినా.. ప్రతి కార్యక్రమంలో వాటిని ఉపయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్లలోనూ అందుబాటులో ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. బాణాసంచాపై ఉన్న నిషేధాన్ని ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా పాటించాలని సుప్రీం కోర్టు బుధవారం పునరుద్ఘాటించింది. వేడుకలకు తాము వ్యతిరేకం కాదన్న సుప్రీం కోర్టు.. ఇతరులు జీవించే హక్కును కాలరాయడం తగదని వ్యాఖ్యానించింది. 130 కోట్ల ప్రజల ప్రాణాలను పరిరక్షించడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొంది. వేడుకలంటే శబ్దాలు చేసే టపాసులు కాల్చడం కాదని.. అవి లేకుండా కూడా వేడుకలు చేసుకోవచ్చని అభిప్రాయపడింది.

బాణాసంచా తయారీదారుల సంఘం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే టపాసులు తయారు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ పరిశ్రమపై దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, శివకాశికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తాము జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం ప్రధాన సమస్యగా పేర్కొంది. కేసును ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని