Bappi Lahiri: స్లీప్‌ ఆప్నియా.. బప్పి లహిరి మరణానికి కారణమిదే!

అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా (OSA) కారణంగానే బప్పి లహిరి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Updated : 16 Feb 2022 19:56 IST

ముంబయి వైద్యుల వెల్లడి

ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) మరణ వార్త యావత్‌ సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచింది. గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ముంబయిలోని క్రిటీకేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా (OSA) కారణంగానే బప్పి లహిరి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్లీప్‌ ఆప్నియా అంటే ఏమిటి, దాని లక్షణాలేమిటో ఓసారి చూద్దాం..

గతకొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. ఇటీవల నెల రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ఈ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మంగళవారం రాత్రి బప్పి లహిరి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, బప్పిలహిరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు క్రిటీకేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దీపక్‌ నామ్‌జోషి వెల్లడించారు.

ఏమిటీ స్లీప్‌ ఆప్నియా..?

స్లీప్‌ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన రుగ్మత. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో పలుసార్లు ఇబ్బంది కలగడాన్ని స్లీప్‌ ఆప్నియాగా పరిగణిస్తారు. అధిక రక్తపోటు వంటి సమస్యలకు కారణం అవడంతోపాటు తీవ్రతను అధికం చేస్తుంది. ఒక్కోసారి గుండెపోటుకు కూడా దారితీయవచ్చు. దీనిని మూడు రకాలుగా పేర్కొంటారు. అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా, సెంట్రల్‌ స్లీప్‌ ఆప్నియా, కాంప్లెక్స్‌ స్లీప్‌ ఆప్నియా. బప్పి లహిరి మరణించింది అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియాతోనే.

అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా..

నిద్రిస్తున్న సమయంలో ఎగువ శ్వాస ద్వారాలు మూసుకొనిపోవడం వల్ల కలిగే ఇబ్బంది ఇది. ఇది వ్యాధే అయినప్పటికీ ఒక్కోసారి మనం గుర్తించలేం కూడా. గొంతులోని సున్నితమైన కండరాలు శ్వాసమార్గాన్ని అడ్డుకున్నప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. తద్వారా నిద్ర మధ్యలోనే శ్వాస హఠాత్తుగా ఆగిపోవడంతో ఆకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఈవ్యాధి ఉన్నవారు నిద్రిస్తున్న సమయంలో పలుసార్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ఇలా శ్వాస సరిగా అందకపోవడంతో శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. గుండె ఆగిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయి.

లక్షణాలు..

* పగటి సమయంలో అతిగా నిద్రమత్తు

* గట్టిగా గురక పెట్టడం

* నిద్రిస్తున్న సమయంలో పలుసార్లు శ్వాస ఆగిపోవడం

* శ్వాస ఆగిపోయి హఠాత్తుగా మెలకువ రావడం

* మెలకువ సమయంలో గొంతు లేదా నోరు మొత్తం పొడిగా మారడం

* ఉదయాన్నే తీవ్ర తలనొప్పి

* పగటి సమయంలో ఏకాగ్రత లేకపోవడం

* కుంగిపోవడం లేదా చిరాకు వంటి మానసిక సమస్యలు

* అధిక రక్తపోటు వంటి లక్షణాలు అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా రుగ్మత ఉన్నవారిలో కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్య పరీక్షలతో ఈ వ్యాధిని ముందుగానే నిర్ధారించుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని