నకిలీ బెదిరింపు కాల్స్‌ చేస్తే.. ఐదేళ్ల పాటు నిషేధం..!

ఇటీవల కాలంలో నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ ఓ సమస్యగా మారింది. విమాన ప్రయాణాల ఆలస్యానికి ఇవొక కారణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వాటి కట్టడికి కఠిన చర్యలు తీసుకునే దిశగా బీసీఏఎస్‌ యోచన చేస్తోంది. 

Published : 19 Jun 2024 15:31 IST

దిల్లీ: ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు నకిలీ బాంబు కాల్స్‌ తరచూ వస్తున్నాయి. దాంతో యాజమాన్యాలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది. నకిలీ కాల్స్‌ కేసుల్లో దోషులుగా తేలితే.. ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు బీసీఏఎస్‌ వెల్లడించింది. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వశాఖ ముందు ఉంచనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ప్రస్తుతం మూడు నుంచి ఆరు నెలల నిషేధం మాత్రమే ఉంది. నిందితులు ఏ ఎయిర్‌లైన్‌కు అయితే బెదిరింపులు చేశారో.. దానివరకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తోంది. అయితే అన్ని సంస్థల విమానాలకు దీనిని వర్తింపజేయాలని బీసీఏఎస్‌ చూస్తోంది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకే రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపుల కారణంగా కొన్ని గంటలపాటు విమానాశ్రయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మధ్యాహ్న సమయంలో ఒకే మెయిల్‌ ఐడీ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని విమానాశ్రయాలకు మెయిళ్లు వచ్చాయి. ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్‌ గ్రూపు ఈ బెదిరింపు మెయిళ్ల వెనక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానానికి కూడా ఈ తరహా కాల్ వచ్చింది. అయితే అవన్నీ ఉత్తుత్తివే అని అధికారులు తేల్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని