చేతికొచ్చే పంటనైనా త్యాగం చేస్తాం: టికాయత్‌

వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ తాము ఇళ్లకు వెళ్లమని భారతీయ కిసాన్‌ సంఘం(బీకేయూ) నాయకుడు రాకేష్‌ టికాయిత్‌ మరోసారి స్పష్టంచేశారు.

Updated : 19 Feb 2021 04:37 IST

హిసార్: వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ తాము ఇళ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేష్‌ టికాయిత్‌ మరోసారి స్పష్టంచేశారు. పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేతికి వచ్చే పంటలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు.

‘రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదు. ఓవైపు పంటలను సాగుచేయడంతో పాటు మరోవైపు ఉద్యమం కొనసాగిస్తాం. ఒకవేళ చేతికి వచ్చిన పంటను తగులబెట్టాల్సి వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలి’ అని హరియాణాలో జరిగిన మహాపంచాయత్‌ సభలో టికాయిత్‌ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ‘ఘర్‌ వాప్‌సీ’ (ఇళ్లకు వెళ్లే) ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడంలో భాగంగా వ్యవసాయ సంఘాలు ఇచ్చే తదుపరి కార్యాచరణకు రైతులు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హరియాణాలో మహాపంచాయత్‌ పూర్తైన తర్వాత దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని విస్తరిస్తామని పేర్నొన్నారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లను నిర్వహిస్తామని టికాయిత్‌ తెలిపారు. మరోవైపు రైతులు చేస్తున్న ఆందోళన రెండు నెలలు దాటింది. ఇప్పటికే ప్రభుత్వం- రైతు సంఘాల మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగాయి. రైతులు చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల ప్రధాని సైతం పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి అడుగులూ పడకపోవడం గమనార్హం. దీంతో చర్చలపై సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని